మరోసారి ఆంధ్రాకు మోడీ మొండిచెయ్యి.. తెలంగాణకు మాత్రం ఇచ్చారు 

No relief funds to Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం అవలంభిస్తున్న వైఖరి ఎంత అసంతృప్తికరంగా ఉందనేది చెప్పనక్కర్లేదు.  హోదా, పోలవరం నిధులు లాంటి కీలకమైన అంశాల్లోనే కాదు చిన్న చిన్న సహాయాల విషయంలోనూ దాటవేత ధోరణిలోనే ఉన్నారు.  కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మీద ఎప్పుడూ ఊరకనే దయతలచదు.  వారికి ప్రయోజనాలైనా ఉండాలి లేకపోతే ముఖ్యమంత్రుల ఒత్తిడైనా ఉండాలి.  అప్పుడే కేంద్రం దిగొచ్చి అడిగినదాంట్లో అరకొరగానైనా నిధులిస్తుంది.  ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ వెళితే ఎలా ఉంటుందో ఇప్పటికే పలుమార్లు చూశాం.  డిమాండ్ చేసి ఒత్తిడి పెంచే  పరిస్థితులైతే లేవక్కడ.  అందుకే ఈ నిర్లక్ష్యం.  ఈ వాదనను పాలక వర్గం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే వాస్తవం.  
 
No relief funds to Andhra Pradesh
No relief funds to Andhra Pradesh
గతేడాది హైదరాబాద్ నగరాన్ని వరదలు ముంచెత్తాయి.  భారీగా ఆస్తినష్టం జరిగింది.   కొందరు ప్రాణాలు కోల్పోయారు కూడ.  ఆ పరిణామం రాజకీయాల్లో కూడ పెద్ద మార్పునే తీసుకొచ్చింది.  వరద పూర్తిగా కేసీఆర్ సర్కార్ వైఫల్యమేనని జనం భావించారు.  బీజేపీ సైతం దాన్నే గట్టిగా ప్రచారం చేసింది.  సహాయం మంత్రి కిషన్ రెడ్డి నగరానికి కేంద్ర బృందాన్ని రప్పించి నష్టాన్ని అంచనా వేయించారు.  సహాయం చేయాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ సైతం తక్షణ సహాయం నిమిత్తం 1350 కోట్లు రిలీజ్ చేయాలని కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర బృందాలు వచ్చి నష్టాన్ని అంచనా వేసుకుని వెళ్లాయి.  వరదల తర్వాత వచ్చిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీని జనం బాగా ఆదరించారు.  ఏకంగా రెండో స్థానంలో నిలబెట్టారు.  ఆ ఫలితమే ఇప్పుడు కనిపిస్తున్నట్టు ఉంది. 
 
గత ఏడాది నైరుతి సీజన్‌లో వర్షాలతో నష్టపోయిన ఐదు రాష్ట్రాలకు ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ నుంచి రూ.1751.05కోట్ల సాయం అందించేందుకు ఉన్నతస్థాయి కమిటీ ఆమోదం తెలిపింది.   ఇందులో తెలంగాణకు 245.96 కోట్ల సహాయాన్ని ప్రకటించారు.  కానీ ఆంధ్రాకు మాత్రం చిల్లిగవ్వ రాలేదు.  గతేడాది ఏపీలో కూడ వర్షాలు గట్టిగానే పడ్డాయి.  కృష్ణా నది పొంగిపొర్లింది.  వాగులు, వంకలు తెగిపోయాయి.  వేల  హైక్టార్లలో పంట నీటమునిగింది.  ఈ నష్టాన్ని  4450 కోట్లుగా అంచనా వేసింది రాష్ట్ర ప్రభుత్వం.  సహాయం కోసం కేంద్రానికి లేఖ కూడ రాశారు సీఎం.  కానీ ఫలితం సున్నా.  1350 కోట్లు  అడిగిన తెలంగాణకు 245 కోట్లు ఇచ్చారు కానీ 4450 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పిన ఏపీకి మాత్రం ఒక్క పైసా కూడ రాలేదు.  ఇకపై వస్తుందో రాదో తెలీదు.  మరి ఈ వైఫల్యం రాష్ట్ర ప్రభుత్వానిదా లేకపోతే కేంద్రం నిర్లక్ష్య విలేఖరికి నిదర్శనమా.  దీని గురించి వైసీపీ నాయకులు కానీ బీజేపీ నేతలు కానీ మాట్లాడతారా, కేంద్రాన్ని నిలదీస్తారా అంటే అదీ డౌటే.