ఇది క్లియర్.! టీడీపీ ఓట్లు జనసేనకు పడవ్.!

రాజకీయాల్లో పొత్తుల వ్యవహారాలు ఎలా వుంటాయ్.? నీకు ఇది.. నాకు అది.. అన్నట్లుండాలి.! పరస్పర అవగాహనతో ఓట్లు ఇట్నుంచి అటు, అట్నుంచి ఇటు ట్రాన్స్‌ఫర్ అవ్వాల్సి వుంటుంది. అలా జరగనప్పుడు, ‘పొత్తు’లో అర్థమేముంది.?

టీడీపీ – జనసేన – బీజేపీ.. ఈ మూడు పార్టీలూ వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం దాదాపు ఖాయమైపోయినట్లే. బీజేపీ కూడా ఈ మేరకు సంకేతాలు పంపుతోంది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్నది జనసేన వ్యూహం.

జనసేన పార్టీనే టీడీపీ – బీజేపీలను కూడా కలుపుతోంది. నిజానికి, ఇది జనసేన చెప్పుకుంటున్న మాట. రాజకీయాల్లో అటు బీజేపీ, ఇటు టీడీపీ.. రెండిటికీ తల పండిపోయింది. రాజకీయ అవసరాల నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కలిసిపోవడం అనేది మామూలే. ఇందులో జనసేనాని వల్ల అదనంగా ఒరిగేదేమీ వుండదు.

కాకపోతే, క్రెడిట్ తీసుకుంటున్నాడు గనుక, పవన్ కళ్యాణ్‌ని అలా సంతోషపడనిస్తున్నాయ్ ఆ రెండు పార్టీలు. ఇదిలా వుంటే, ‘మీకు అవసరం.. మాతో కలవడం. మాకేం అవసరం మీతో కలవడానికి..’ అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఇంతవరకు టీడీపీ అధినేత చంద్రబాబు, ‘జనసేనానిపై ప్యాకేజీ ఆరోపణల్ని’ ఖండించలేదు. దానర్థమేంటి.? ఆ ఆరోపణల్ని ఆయనా ఎంజాయ్ చేస్తున్నారు.

ఎక్కడా గ్రౌండ్ లెవల్‌లో టీడీపీ నుంచి జనసేన వైపుకు ఓట్లు వెళ్ళే పరిస్థితి లేకుండా చంద్రబాబు ప్లాన్ సిద్ధం చేశారట. అలాగైతేనే, తక్కువ సీట్లను జనసేన ఆశిస్తుందన్నది చంద్రబాబు వ్యూహం. పది నుంచి పదిహేను మాత్రమే.. అని తెలుగు తమ్ముళ్ళు సంకేతాలు పంపుతోంటే, జనసేన మాత్రం 70 వరకు ఆశిస్తోందిట.