జనసేనాని ఉవాచ.! వైసీపీ ఒక్కటీ గెలవకూడదు.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విశాఖపట్నంలో ‘వారాహి విజయ యాత్ర’ చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల తర్వాత, ఉత్తరాంధ్రపై జనసేన అధినేత ఫోకస్ పెట్టారు.

విశాఖలో కొన్నాళ్ళ క్రితం జరిగిన గలాటా (విశాఖ వేదికగా జనసేనాని హంగామా, ఎయిర్‌పోర్టు ప్రాంతంలో నడిచిన హైడ్రామా.. స్టార్ హోటల్‌లో జనసేనాని వుండిపోవడం.. ఇవన్నీ) అందరికీ గుర్తుండే వుంటుంది. ఆ వ్యవహారంతో కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీకి, జనసేన పవర్ ఏంటో తెలిసొచ్చిందని జనసేన అధినేత చెబుతున్నారు. నేరుగా ఇవే మాటలు చెప్పలేదుగానీ, కష్ట కాలంలో మనం చూపిన తెగువ, బీజేపీకి మనపై నమ్మకాన్ని పెంచిందని పవన్ చెప్పడమంటే.. అసలు అర్థం అదే.

ఇదిలా వుంటే, విశాఖలో చేపట్టనున్న వారాహి విజయ యాత్ర గురించి మాట్లాడుతూ జనసేనాని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ముఖ్య నేతలకు దిశా నిర్దేశం చేసే క్రమంలో విశాఖలో ఒక్క సీటూ వైసీపీ గెలవకూడదని హుకూం జారీ చేశారు. ఇదెక్కడి పంచాయితీ.? ఎవరో గెలవకూడదని రాజకీయాలు చేస్తారా.?

వైసీపీ గెలవకూడదు సరే.. జనసేన పార్టీనే అన్ని సీట్లూ గెలుచుకోవాలని పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్య నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారా.? అంటే అదీ లేదు. మొన్నటికి మొన్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనూ అదే తంతు. ఒక్క సీటు కూడా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి వైసీపీని గెలవనివ్వను.. అని పవన్ కళ్యాణ్ సెలవిచ్చారు.

ఇదే, రాజకీయాల్లో జనసేన పార్టీని దెబ్బతీస్తోంది. వైసీపీ అధికారంలోకి రాకూడదు.. జనసేన పార్టీ గెలవాలని కోరుకుంటున్నట్లుగా జనసేనాని గట్టిగా చెప్పరు. అంటే, టీడీపీని గెలిపించడం కోసమే తన రాజకీయం.. అని జనసేనాని సంకేతాలు పంపుతున్నట్టేగా.!