యువగళం.! ముఖ్యమంత్రి అభ్యర్థిగా నారా లోకేష్.?

ప్రత్యక్ష రాజకీయాలకు దాదాపుగా గుడ్ బై చెప్పేసే యోచనలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వున్నారా.? ‘యువగళం’ పాదయాత్ర ద్వారా నారా లోకేష్‌ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసేందుకు చంద్రబాబు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకున్నారా.?

హైద్రాబాద్‌లోని తన ఇంటి నుంచి నారా లోకేష్, ‘యువగళం’ పాదయాత్ర నిమిత్తం బయల్దేరారు. తాత స్వర్గీయ ఎన్టీయార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం, ఆయన కుప్పం బయల్దేరారు. కుప్పం నుంచి నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభమవుతుంది.

సుమారుగా 400 రోజులపాటు దాదాపు 4 వేల కిలోమీటర్ల దూరం ఈ పాదయాత్ర సాగుతుంది. వైఎస్ జగన్ కోసం గతంలో వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తున్నట్లు, చంద్రబాబు కోసం నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారా.? అంటే, దీనిపై మళ్ళీ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

‘సీఎం లోకేష్..’ అంటూ కార్యకర్తలు నినదించేలా పార్టీ యంత్రాంగం వ్యూహ రచన చేస్తుండడం చూస్తోంటే, చంద్రబాబుకి 2024 ఎన్నికలపై ఆశలు సన్నగిల్లినట్లే కనిపిస్తోంది. చంద్రబాబు కూడా ఇప్పుడున్న రాజకీయాల పట్ల ఒకింత అసహనంతో వున్నారు.

వృద్ధాప్య సమస్యలూ ఆయనకు ఒకింత ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపథ్యంలో నారా లోకేష్ మొత్తం బాధ్యతల్ని భుజానికెత్తుకున్నట్లు కనిపిస్తోంది.