ఆల్ ఫ్రీ… నమ్మితే చాలు ఆదరించినట్లే కానీ…!

విజయనగరం జిల్లా పోలిపల్లిలో జరిగిన యువగళం పాదయాత్ర ముగింపు సభకు టీడీపీ, జనసేన కేడర్ భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా సుమారు 10ఏళ్ల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కనిపించారు. దీంతో పొత్తును స్వాగతించే ఇరుపార్టీల కార్యకర్తలకు కొత్త ఉత్సాహం వచ్చింది. ఇద్దరు ఎరండువైపులా ఉండి చినబాబు లోకేష్ నాయకత్వాన్ని బలపరిచేలా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీలు ఆసక్తిగా మారాయి!

తాజగా జరిగిన యువగళం పాదయాత్ర ముగింపు సభలో చంద్రబాబు ఉచిత హామీల వర్షం కురిపించేశారు. ఇందులో ప్రధానంగా కర్ణాటకలోనూ, తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో కీలకంగా మారిన “మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం” హామీని చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే ఏపీలో కూడా అమలుచేస్తానని ప్రకటించారు. కాపీ పేస్ట్ అనే సంగతి కాసేపు పక్కనపెడితే… చంద్రబాబు ఇంత బోల్డ్ గా ఆ హామీ ఇవ్వడం ఆసక్తిగా మారింది.

ఈ హామీవల్ల ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులు ఇప్పటికే తెలంగాణలో ప్రత్యక్షంగా కళ్లకు కట్టినట్లు కనిపించిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ఈ విషయంపై పలువర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. బస్సుల సంఖ్య భారీగా పెంచకుండా ఉచితం అనేసరికి… ఆర్టీసీ బస్సుల్లో ప్రయణా స్వరూపం మారిపోయి నరక ప్రాయంగా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

ఆ సంగతి అలా ఉంటే… ప్రధానంగా మహిళా ఓటు బ్యాంకును ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు మరికొన్ని హామీలు ఇచ్చారు. ఇందులో భాగంగా… “తల్లికి వందనం” అన్న హామీ ద్వారా ఏడాదికి పదిహేను వేల రూపాయలు మహిళల ఖాతాలో వేస్తామని అన్నారు. అయితే ఇది “జగనన్న అమ్మ ఒడి” కార్యక్రమానికి కాపీ అనే కామెంట్లు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సరికొత్త పథకం ప్రకటించారు బాబు.

అందులో భాగంగా… పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతీ మహిళకు నెలకు 1500 రూపాయలు నగదు నేరుగా ఆమె ఖాతాలోనే వేస్తామని హమీఇచ్చారు. అదే విధంగా ఏడాదికి మూడు సిలెండర్లు ఉచితంగా ఇస్తామని.. రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయల ఆర్ధిక సాయం చేస్తామని బాబు హామీ ఇచ్చారు. ఇదే క్రమంలో నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయలు వంతున “నిరుద్యోగ భృతి” ఇస్తామని చంద్రబాబు మరో భారీ హామీ ఇచ్చారు.

అయితే ఈ హామీ 2014లో ఒకసారి ఇవ్వడం.. నాడు కార్మిక శాఖా మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు ఈ విషయంపై సీరియస్ గా స్పందించడం.. ఆనాక మమా అనడం తెలిసిందే. అయినా సరే… మళ్లీ ఈ హామీని తెరపైకి తెచ్చారు చంద్రబాబు. అయితే ప్రస్తుతానికి ఇవి కొన్ని మాత్రమే అని తెలుస్తుంది. త్వరలో అసలు హామీలు పూర్తి మ్యానిఫేస్టో త్వరలో విడుదల చేస్తామని చెబుతున్నారు. ఇందులో భాగంగా టీడీపీ – జనసేన ఉమ్మడి ప్రణాళికను అమరావతిలో రిలీజ్ చేస్తాయని బాబు ప్రకటించారు.

ఇలా చంద్రబాబు శాంపుల్ గా వదిలిన హామీలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే గతానుభవాల దృష్ట్యా.. చంద్రబాబు ఇచ్చిన హామీలను ప్రజలు ఏ మేరకు విశ్వసిస్తారు అనే విషయంపై టీడీపీ – జనసేన కూటమి గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. ఇక్కడ నమ్మడమే ప్రధానం!