ఏపీలో జూన్ 4 కోసం కోట్ల కళ్లు ఎదురుచూస్తున్నాయి. ఆ రోజు జగన్ మళ్లీ సీఎం అవుతారా.. లేక, కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందా అనే ప్రశ్నకు సమాధానం దొరకబోతోంది. జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పటికీ.. జూన్ 4న వచ్చే ఎగ్జాట్ పోల్స్ పైనే అందరి ఆసక్తి నెలకొంది. అయితే ఆ రోజు కేవలం ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులదే కాదు మరో సూమారు 2.5 లక్షల మంది భవిష్యత్తుపై కూడా క్లారిటీ రానుందనే చర్చ తెరపైకి వచ్చింది.
అవును… ఎన్నికల సీజన్ రాగానే ఏపీలో వాలంటీర్ల విషయం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో… వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలంటూ కోర్టులో కేసులు వేసింది ప్రతిపక్షం! ఆఖరికి వృద్ధులకు అందించే పెన్షన్ల పంపిణీకి కూడా వాలంటీర్లను దూరం చేసింది. దీంతో… పెన్షన్ దారుల శాపనార్థాలు చంద్రబాబు & కో కి బలంగా తగిలాయనే కామెంట్లూ వినిపించాయి.
ఈ నేపథ్యంలో… చాలామంది వాలంటీర్లు స్వచ్ఛందంగా తమ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. మరికొందరు వైసీపీ నేతల భరోసాతో రాజీనామాలు చేశారు. అయితే… వీరంతా ఎన్నికల వేళ వైసీపీ గెలుపు కోసం చురుగ్గా పనిచేశారని చెబుతున్నారు. ఇక రాజీనామా చేసిన వారందర్నీ మళ్లీ తమ ప్రభుత్వం రాగానే తిరిగి ఆయా పోస్టుల్లోకి తీసుకుంటామని వైసీపీ నేతలు గట్టి హామీ ఇచ్చారు.
అంటే… వైసీపీ అధికారంలోకి వస్తే రాజీనామా చేసిన వాలంటీర్లకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక కూటమి అధికారంలోకి వస్తే రాజీనామాలు చేయని వారికి కాలం కలిసొస్తుందని చెప్పాలి. కారణం… వాలంటీర్ల పారితోషికాన్ని రూ.5వేల నుంచి రూ.10వేలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీంతో… జీతాలు పెంచితే మాత్రం రాజీనామాలు చేసినవారు ఇరుకున పడే అవకాశముంది.
కొత్త ప్రభుత్వం ఏర్పడితే, వైసీపీకి మద్దతుగా రాజీనామాలు చేసిన వాళ్లంతా తమ పోస్ట్ లపై ఆశలు వదులుకోవాల్సిందే. జీతం పెరగడం, పెరగకపోవడం సంగతి దేవుడెరుగు… ఉన్న ఉద్యోగం కూడా పోయినట్టే అనుకోవాలి. అయితే గతంలో వాలంటీర్ పోస్ట్ లే వద్దు అని చెప్పిన చంద్రబాబు, వారికి జీతాలు రెట్టింపు చేస్తామని ప్రకటించారు.
అంత జీతం ఇస్తే వారితో ఏయే పనులు చేయిస్తారు అనేది ఒక ప్రశ్న అయితే… అసలు ఆ ఆ కొలువులు ఎన్నిరోజులు ఉంచుతారనేది మరో పెద్ద ప్రశ్నగా మారింది! ఎందుకంటే… కూటమి అధికారంలోకి వచ్చినా… వాలంటీర్లను టీడీపీ నేతలు, కార్యకర్తలు రిసీవ్ చేసుకోరనే చర్చ తెరపైకి వస్తుంది. జన్మభూమి కమిటీలనే వారు తిరిగి కోరుకునే అవకాశం ఉందని అంటున్నారు.
అలా కాకుండా మళ్లీ జగనే వస్తే మాత్రం ఉద్యోగాల్లో ఉన్నవారితో పాటు రాజీనామాలు చేసిన వారూ ఫుల్ హ్యాపీ అని చెబుతున్నారు. అంటే… వైసీపీ అధికారంలోకి వస్తే రాజీనామాలు చేసిన వారు సేఫ్, కూటమి వస్తే రాజీనామాలు చేయకుండా జీతాలు తీసుకున్న వారు ప్రసెంట్ సేఫ్! అసలు వాలంటీర్ల భవితవ్యం ఏమి కాబోతుంది.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నిజంగానే వాలంటీర్లను కంటిన్యూ చేస్తారా.. లేక, తూచ్ అంటారా అనే డౌటూ ఉండటం గమనార్హం.