ప్రతిపక్షాలు టీడీపీ, బీజేపీలు అధికార పక్షం మీదకి పోటీకి సై అంటున్నాయి. ఎన్నికలు ముగిసిన ఏడాదిన్నర కావోస్తుండటంతో తాము బలపడ్డామని, జగన్ బలహీనపడ్డారబి భావిస్తున్న టీడీపీ, బీజేపీలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నాయి. అలాంటి తరుణంలోనే తిరుపతి పార్లమెంట్ సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్రావు మరణంతో ఆ స్థానానికి ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇంకొన్నీ నెలల్లో ఉపఎన్నికలు జరిగే అవకాశం ఉంది. సిట్టింగ్ స్థానం కావడంతో గెలుపు తమదే అనే ధీమాతో జగన్ ఉన్నారు. మొదట ఉప ఎన్నికల్లో నిలబడకూడదని అనుకున్న టీడీపీ ఇప్పుడు మనస్సు మార్చుకుంది. పోటీచేయకపోతే కేడర్లోకి, జనంలోకి తప్పుడు సంకేతాలు వెళతాయనే ఉద్దేశ్యంతో పోటీకే నిర్ణయించుకుంది.
మొదట పనబాక లక్ష్మిని బరిలోకి దింపాలని చూసినా ఆమె పోటీకి సుముఖంగా లేకపోవడంతో వర్ల రామయ్యకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. త్వరలోనే అభ్యర్థి ఎవరనేది డిసైడ్ కానుంది. ఇరాక్ బీజేపీ సైతం ఈ స్థానం మీద నమ్మకం పెట్టుకుంది. రాష్ట్రంలో ఆ పార్టీకి అంతో ఇంతో ఆదరణ ఉన్నది తిరుపతిలోనే. అందుకే పోటీకి రెడీ అంటోంది. పైగా జనసేన మద్దతుగా ఉండటంతో గెలుపు మీద ఆశలు పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థే పోటీకి దిగుతారని పవన్ వారికి మద్దతిస్తారని తెలుస్తోంది. ఇంకొద్దిరోజుల్లో మంచి అభ్యర్థిని చూసి ప్రకటన చేయనున్నారు.
ఇలా ప్రతిపక్షాలు ఉప ఎన్నికలకు సిద్ధమవుతుంటే జగన్ ఆ స్థానం తమదేనని గట్టి నమ్మకంతో ఉన్నారు. బల్లి దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యుల్లోనే ఒకరికి టికెట్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఎక్కువ భాగం ఆయన కుమారుడు కళ్యాణ్ చక్రవర్తికే అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలు తమ ఖాతాలోనే ఉండటంతో ప్రత్యర్థులు చిత్తుకావడం ఖాయమని భావిస్తున్నారు. ఇలా మూడు పార్టీలు ఎవరికివారు గెలుపు మీద సొంత లెక్కలు వేసుకుంటూ పోటీకి ఉవ్విళూరుతున్నారు. ఒకరంకంగా చెప్పాలంటే గెలుపును ముగ్గురు అధ్యక్షులు ఈగోగా తీసుకున్నట్టు అనిపిస్తోంది.