ఏబీఎన్ రాధాకృష్ణతో వైసీపీ చేతులు కలిపిందా.?

‘మీ ప్యాకేజీ బాగోతాన్ని ఏబీఎన్ రాధాకృష్ణ నిర్ధారించారు..’ అంటూ ‘కాపీ పేస్ట్’ కామెంట్లను సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు ఎడా పెడా దంచేస్తున్నారు. మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఇలా వైసీపీ నుంచి చాలామంది చేస్తున్న ట్వీట్లు, ఇతరత్రా సామాజిక మాధ్యమాల్లోని కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ ‘వెయ్యి కోట్ల డీల్ ఆఫర్ చేశారు’ అన్నది, రాధాకృష్ణ పలికిన ‘పలుకు’ సారాంశం. రాధాకృష్ణ రాతల్లో వాస్తవం.. నేతి బీరకాయలో నెయ్యి.. ఒకటే.! ఆ విషయం వైసీపీ కంటే బాగా ఎవరికి తెలుసు.? కానీ, జనసేన అధినేతను కార్నర్ చేయడానికి ‘ఏబీఎన్ రాధాకృష్ణ’ని వైసీపీ వాడుకుంది. నిజానికి, దీన్ని పూర్తిగా తప్పు పట్టేయలేం. వైసీపీ పాలనను విమర్శించే క్రమంలో ఈనాడు, ఆంధ్రజ్యోతిల్లో వచ్చే వార్తల్ని జనసేన అధినేత ప్రస్తావిస్తుంటారు మరి.!

అయితే, జనసేన అనేది విపక్షం. వైసీపీ అలా కాదు కదా. వైసీపీ అధికారంలో వుంది. అధికారంలో వున్న వైసీపీ మీద నిత్యం ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో నెగటివ్ కథనాలే వస్తుంటాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కావొచ్చు.. ఇంకోటి కావొచ్చు.. అన్నిటిలోనూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దోసిలా చూపిస్తుంటుంది వైసీపీ.

పవన్ కళ్యాణ్ మీద ఏబీఎన్ రాధాకృష్ణ ‘ప్యాకేజీ’ ఆరోపణల్ని వైసీపీ సమర్థించడమంటే.. వైఎస్ జగన్ అవినీతిపరుడనీ, బాబాయ్‌ని చంపించిన నేరగాడనీ.. చాలాకాలంగా ఆరోపిస్తున్న ఏబీఎన్ రాధాకృష్ణ మాటలు, వార్తలు కూడా నిజాలేనిన వైసీపీ ఒప్పుకున్నట్లే. ఈ విషయంలో వైసీపీ, కాస్త సోయతో వ్యవహరించి వుంటే బావుండేది.!