గతాన్ని తవ్వుకోవడమెందుకు.? వైసీపీకి అవసరమా ఇవన్నీ.?

మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మినారాయణ గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు మీద చేసిన విమర్శల తాలూకు వీడియోల్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. వైసీపీకి చెందిన కొందరు నేతలు ఈ వీడియోల్ని సోషల్ మీడియాలో పెడుతున్నారు.

రాజకీయాల్లో గతాన్ని తవ్వుకోవడమంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటుండదు. కన్నా లక్ష్మినారాయణ కాంగ్రెస్ నుంచి నేరుగా వైసీపీలోకి వెళ్ళాల్సిన వ్యక్తి. చివరి నిమిషంలో బీజేపీ ఆయన్ని హైజాక్ చేసింది. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరారు. ఇది అందరికీ తెలిసిన విషయమే.

రాజకీయాల్లో విమర్శలు సహజం. పార్టీ మారే క్రమంలో నాయకులు మాట మార్చడమూ సహజమే. గతంలో కాంగ్రెస్ పార్టీని కీర్తించిన వైఎస్ జగన్, ఆ పార్టీ మీద విమర్శలు చేశారు.. ఆ పార్టీని ఆంధ్రప్రదేశ్‌లో పాతాళానికి తొక్కేశారు కూడా.

ఇక, ప్రస్తుతం వైసీపీలో వున్న చాలామంది ముఖ్య నాయకులనబడేవారు, గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నానా రకాలుగా విమర్శించినవారే. బొత్స సత్యనారాయణ దగ్గర్నుంచి మొదలు పెడితే, కనీసం ఓ పాతిక మంది నేతలు కనిపిస్తారు అలాంటోళ్ళు.

ఆయా నేతలు గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించిన వీడియోల్ని టీడీపీ బయటకు లాగుతోంది. కన్నా వీడియోలు బయటకు వస్తే, ఆయనకొచ్చిన నష్టం లేదు. టీడీపీకి వచ్చిన నష్టం అసలే లేదు. కానీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే చాలా చాలా నష్టం.!