గోదావరి పుష్కరాలపై నివేదిక సమర్పించిన ఏకసభ్య జస్టిస్ సోమయాజుల కమీషన్ నివేదిక వివాదాస్పదమవుతోంది. ఇంత వివాదాస్పదమైన నివేదిక ఈమధ్య కాలంలో ఇంకోటి లేదనే చెప్పాలి. ఇదే విషయమై వైసిపి అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ, సోమయాజులు కమీషన్ చంద్రబాబును కాపాడటానికే అన్నట్లుగా ఉందని మండిపడ్డారు. టిడిపి కార్యాలయంలో కూర్చుని నివేదిక రెడీ చేశారా అంటు దులిపేశారు. ఇంత దౌర్భాగ్యమైన నివేదికను ఏ కమిటీ ఎప్పుడూ ఇవ్వలేదంటూ ధ్వజమెత్తారు. అసలు నివేదిక మొత్తాన్ని చంద్రబాబే తయారుచేసి సోమయాజుల చేత సంతకాలు చేయించుంటారంటూ పద్మ అనుమానం వ్యక్తం చేయటం గమనార్హం.
2015 జూలై 14వ తేదీన గోదావరి పుష్కరాల సందర్భంగా ఘోర ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. రాజమండ్రిలోని పుష్కర ఘాట్లో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మరణించారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమనే చెప్పాలి. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే బాధ్యత వహించాలి. ప్రతిపక్షాలు కూడా అదే అంటున్నాయి.
ప్రమాదానికి దారితీసిన ఘటనలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం . పుష్కరాల్లో పుణ్యస్నానం కోసం చంద్రబాబు కూడా కుటుంబసమేతంగా హాజరయ్యారు. ప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన వివిఐపి ఘాట్లో కాకుండా చంద్రబాబు కుంటుంబం పుష్కరఘాట్లో స్నానం చేశారు. దానికితోడు పుష్కరాలు, పవిత్రస్నానాలు తదితరాలను చిత్రీకరించేందుకు, ప్రచారం కోసం టూరిజం శాఖ నేషనల్ జియోగ్రఫీ ఛానల్ తో ఒప్పందం చేసుకుంది. మరి, ప్రచారమన్నాక చంద్రబాబు లేకుండా సాధ్యమవుతుందా ? అందుకనే వివిఐపి ఘాట్ నుండి పుష్కర ఘాట్ కు వచ్చారు చంద్రబాబు.
ఎందుకంటే, పుష్కరఘాట్ వద్ద అప్పటికే వేలాది మంది భక్తులు స్నానాల కోసం వెయిట్ చేస్తున్నారు. మరోవైపు వివిఐపి ఘాట్ వద్ద బందోబస్తు కారణంగా జనాలు ఎక్కువమంది లేరు. చంద్రబాబు వల్లే పుష్కరాలు ఫేమస్ అయ్యాయని, ప్రభుత్వం ఎంత బాగా ఏర్పాట్లు చేస్తోందో చూపించటానికా అన్నట్లుగా క్లోజప్ లో చంద్రబాబు, చుట్టూ జనాలు వచ్చేట్లుగా ఫిల్మ్ తీయించాలన్నది ఉన్నతాధికారుల ప్లాన్. ఎందుకంటే సమయం ఏదైనా ప్రచారం వచ్చేట్లు చూసుకోవటమే చంద్రబాబు లక్ష్యం కాబట్టి. అంతా అనుకున్నట్లే జరిగింది. కానీ చంద్రబాబు స్నానం చేసి వెళ్ళిపోగానే గేట్లెత్తేసిన అధికారులు అక్కడి నుండి మాయమైపోయారు. ఎప్పుడైతే గేట్లెత్తేశారో భక్తులు ఒక్కసారిగా ఘాట్లలోకి పరుగెత్తారు. దాంతో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో 29 మంది మరణించారు.