నారా లోకేష్ పాదయాత్రకి వైసీపీ పబ్లిసిటీ.?

ఎందుకీ చర్చ జనాల్లో జరుగుతోంది టీడీపీ నేత నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రకి వైసీపీ ఎందుకు పబ్లిసిటీ ఇస్తుంది.? రాజకీయాలన్నాక విమర్శలు సహజం. మాటకు మాట.. అనేది రాజకీయాల్లో తప్పనిసరైపోయింది. ఆయనేదో అంటాడు.. దానికి వీళ్ళేదో కౌంటర్ ఎటాక్ చేస్తారు.. వెరసి రచ్చ తప్పదు. వాస్తవానికి నారా లోకేష్ ‘పాదయాత్ర’ సందర్భంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఆయన నడకలోనే స్పష్టంగా కనిపిస్తోంది. జనం పెద్దగా రావడంలేదు కొన్ని సందర్భాల్లో. ఆ అసహనం నేపథ్యంలో మాటలూ తడబడుతున్నాయి. ఇంకోపక్క, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ద్వారానే పొలిటికల్ మైలేజీ పొందాలని నారా లోకేష్ భావిస్తున్నారు.

మంత్రి రోజాపై విమర్శలు చేసినా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తూలనాడుతున్నా.. ఇవన్నీ లోకేష్ మార్కు పబ్లిసిటీ స్టంట్లే. వాటికి వైసీపీ స్పందిస్తున్న తీరు, టీడీపీ యువగళానికి వైసీపీ అదనపు పబ్లిసిటీ ఇస్తోందన్నట్లుగా కనిపిస్తోంది. మంత్రులు తమ శాఖల వ్యవహారాలు మాట్లాడుతున్నది చాలా చాలా అరుదు. పవన్ కళ్యాణ్ మీదనే ఎక్కువగా మాట్లాడుతుంటుంటారు. ఆ తర్వాతి స్థానం నారా లోకేష్‌దే. ఈ లిస్టులో చంద్రబాబు స్థానం కిందకి పడిపోయింది.

లోకేష్ విమర్శలు చేసినాగానీ, పవన్ కళ్యాణ్ ప్రస్తావనను మంత్రులు తీసుకురావాల్సిందే. తద్వారా ఏం సంకేతాన్ని జనాల్లోకి వైసీపీ పంపుతోంది.? అన్నది కీలకం ఇక్కడ. లోకేష్ పాదయాత్రకీ, పవన్ కళ్యాణ్ వారాహికీ వైసీపీ నేతలు.. అందునా మంత్రులే బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతున్నారు. యువగళం సంగతి పక్కన పెడితే, వారాహి విషయంలో వైసీపీ నేతలు, అందునా మంత్రులు ఇస్తున్న పబ్లిసిటీతో.. ప్రత్యక్షంగా తాను ఏపీలో వుండాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారేమో.! ఏది ఏమైనా, అస్సలేమాత్రం జనాల్లేని నారా లోకేష్ పాదయాత్రకు పొలిటికల్ మైలేజీ ఇస్తున్నది ముమ్మాటికీ వైసీపీనే.