విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రయత్నాలపై వైసీపీ నేతలు మండిపడ్డారు. కర్మాగారం సమీపంలో కార్మికులు ఈ రోజు బహిరంగ సభ నిర్వహించారు. దీనికి వైసీపీ నేతలు అవంతి శ్రీనివాస్, విజయసాయిరెడ్డి, వామపక్ష నేతలు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు.
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ… కార్మికుల హక్కుల కోసం పోరాడాల్సిందేనని అన్నారు. రాజకీయాలకు అతీతంగా పోరాడదాని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని మనం మొదటి నుంచీ చెబుతున్నామని విజయసాయిరెడ్డి అన్నారు. దాన్ని ప్రైవేటుపరం చేయకుండా చూసుకోవాలని చెప్పారు. ఐదు దశాబ్దాల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా మహోజ్వల పోరాటానికి విశాఖ ఉక్కు ఉద్యమం స్ఫూర్తిని ఇచ్చిందని, దాన్ని పోరాడి సాధించుకున్నామని తెలిపారు. వేలాది మందికి ఆ కర్మాగారం ఉద్యోగాలు కల్పిస్తోందని విజయసాయిరెడ్డి తెలిపారు. కార్మికులు చేస్తోన్న ఉద్యమానికి తాము మద్దతు తెలుపుతామని చెప్పారు.
ఈనెల 12న విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని ఐఎస్‌టీయూసీ పేర్కొంది. కూర్మన్నపాలెంలో వేలాది మంది కార్మికులతో నిరసన కార్యక్రమం ఉంటుందని తెలిపింది. 18న స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు, భార్యా పిల్లలతో నిరసన కార్యక్రమం చేపడతామని ప్రకటించింది. కేంద్రం ఆధ్వర్యంలోనే స్టీల్‌ప్లాంట్ కొనసాగాలని, వేలాది మంది భూముల త్యాగంతో స్టీల్‌ప్లాంట్ ఏర్పడిందని ఐఎన్‌టీయూసీ డిమాండ్ చేసింది.