2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ, ఎక్కువకాలం జనసేన పార్టీలో వుండలేకపోయారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తిరిగి సినిమాల్లో నటించేందుకు నిర్ణయం తీసుకోవడం లక్ష్మనారాయణకు నచ్చలేదు. ‘రాజకీయాలకే పూర్తి సమయం కేటాయిస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్, మాట తప్పారు..’ అంటూ లక్ష్మినారాయణ ఓ కుంటి సాకు చూపి, జనసేనను వీడారు.
ఆ తర్వాత సేవా కార్యక్రమాల పరంగా తన పనేదో తాను చూసుకుంటున్న లక్ష్మినారాయణ అనూహ్యంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయమై మళ్ళీ మీడియాకెక్కారు. అంతే కాదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనను ఆహ్వానిస్తే, తిరిగి జనసేనలో చేరతానని కూడా ప్రకటించారు ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో. తాజాగా లక్ష్మినారాయణ, కోర్టును ఆశ్రయించారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్ర క్యాబినెట్ నిర్ణయం అసమంసజమని పేర్కొంటూ. నష్టాల పేరుతో విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు సంస్థలకు విక్రయించేయాలన్న ఆలోచన సరికాదంటున్నారు లక్ష్మినారాయణ. అయితే, ఈ విషయమై న్యాయస్థానం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. బిల్డ్ ఏపీ పేరుతో రాష్ట్రంలో భూముల అమ్మకాలకు ప్రభుత్వం సిద్ధపడితే, న్యాయస్థానాల్లో జగన్ సర్కార్ మొట్టికాయలు తినాల్సి వచ్చింది. మరి, అదే పరిస్థితి కేంద్రానికి కూడా వస్తుందా.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే. ఒక్కటి మాత్రం నిజం.. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల వేళ, విశాఖ ఉక్కు ఉద్యమం మరింత ఘాటెక్కేలానే వుంది.