మల్కాపురం లో విషాదం.. విద్యుదాఘాతంతో మృతి చెందిన ఈపీడీసీఎల్‌ ఎనర్జీ ఉద్యోగి…!

మరణం ఎప్పుడు ఎలా సంభవిస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. కొన్ని సందర్భాలలో నిమిషాలలో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. తాజాగా ఇటువంటి విషాదకరంగా మల్కాపురంలో చోటుచేసుకుంది. లోవగార్డ్‌న్స్‌ వద్దనున్న ట్రాన్స్‌ఫార్మర్‌కు సంబంధించిన మరమ్మతులు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే…స్టీల్‌ ప్లాంట్‌ ఇస్లాంపేటలో నివాసం వుంటున్న తాజుద్దీన్‌ (22) అనే యువకుడు మల్కాపురం జాలరవీధి పరిధిలో గల సచివాలయంలో ఇంజనీర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో షిప్‌యార్డు లోవగార్డ్‌న్స్‌ వద్దనున్న ట్రాన్స్‌ఫార్మర్‌కు సంబంధించిన విద్యుత్‌ లైన్‌లో మరమ్మతులు ఏర్పడ్డాయని విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో..తాజుద్దీన్‌ తో పాటు లైన్ మాన్ అర్జున్‌ కూడా మరమ్మతులు చేపట్టేందుకు లోవగార్డన్స్‌కు వెళ్లారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కి మరమ్మతులు చేయటానికి తాజుద్దీన్‌ పైకి ఎక్కి మరమ్మతు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్‌ సరఫరా అయ్యింది. దీంతో ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కి మరమ్మత్తులు చేస్తున్న తాజుద్దీన్‌ విద్యుదాఘాతానికి గురై ట్రాన్స్‌ఫార్మర్‌ పైనే మృతి చెందాడు.తాజుద్దీన్‌ మృతి చెందిన విషయాన్ని లైన్‌మన్‌ అర్జున్‌ ఈ ఈపీడీసీఎల్‌ అధికారులకు తెలియజేశాడు. దీంతో వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్‌ సహాయంతో మృతదేహన్ని కిందకు దించారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని తాజుద్దీన్‌ మృతదేహాన్ని స్థానికంగా వున్న ఐఎన్‌ఎస్‌ కల్యాణి ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు.

చేతికందిన కొడుకు ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడంతో అతని తల్లదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ట్రాన్స్‌పార్మర్‌పై మరమ్మతులు ప్రారంభించటానికి ముందు మల్కాపురం విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నుంచి ఎల్‌సీ (లైన్‌ క్లియరెన్స్‌) తీసుకున్నాకే మరమ్మత్తు పనులు చేపట్టామని, అయినా ఏ కారణం వల్లో విద్యుత్‌ సరఫరా కావడంతో తాజుద్దీన్‌ మృతి చెందాడని లైన్మెన్ అర్జున్‌ చెబుతున్నాడు. ఈ ఘటన పై మల్కాపురం సీఐ దుర్గాప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.