Jagan padayatra 2.0: త్వరలోనే జగన్ పాదయాత్ర 2.0.. ప్రత్యర్థులకు రప్పా రప్పానేనా..?

Jagan padayatra 2.0

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారా..? 2024 ఎన్నికల్లో ఎదురైన పరాభావం మర్చిపోయేలా కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు నిర్ణయించుకున్నారా..? 2029లో జరిగే ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా అడుగులు వేయనున్నారా.. ? అంటే అవుననే చెబుతున్నారు వైసీపీ నేతలు. అంతేకాకుండా ఈసారి జగన్ పాదయాత్ర 2.0 గతంలో కంటే అదిరిపోయేలా ఉంటుందని చెబుతున్నారు.

పాదయాత్రతో ముఖ్యమంత్రిగా వైఎస్సార్..

తెలుగు రాష్ట్రాల్లో నేతలు పాదయాత్రలు చేయడం కొత్తేమీ కాదు. ఇప్పటికే అనేక మంది నేతలు పాదయాత్రలు చేశారు. అసలు తెలుగు నేల మీద ఈ ఒరవడికి శ్రీకారం చుట్టింది దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. 2004 ఎన్నికలకు ముందు 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 11 జిల్లాలలో 60 రోజుల పాటు 1,500 కిలోమీటర్లు మేర మూడు నెలల పాటు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో ప్రజల సమస్యలను దగ్గరుండి చూశారు. రైతులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తమ కష్టాలను వైఎస్సార్ తీరుస్తారని నమ్మిన ప్రజలు 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించారు. అనంతరం వైఎస్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో మహానేతగా నిలిచిపోయారు.

తండ్రి స్ఫూర్తితో జగన్ సుదీర్ఘ పాదయాత్ర..

అనంతరం ఆయన వారసుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రి స్ఫూర్తితో 2017లో ప్రజాసంకల్ప యాత్ర పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేశారు. దాదాపు 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్లకు పైగా నడిచి సుమారు రెండు కోట్ల మందిని కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు, మత్స్యకారులు, ఆటో డ్రైవర్లు, ఉపాధ్యాయులు, నాయీ బ్రాహ్మణులు , చేనేత కార్మికులు, స్వర్ణకారులు, అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, న్యాయవాదులు, అంబులెన్స్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగ యువత వంటి ఎంపిక చేసిన సమూహాలతో సమావేశాలు నిర్వహించారు. 13 జిల్లాల మీదుగా 175 నియోజకవర్గాల్లో 134 నియోజకవర్గాలను కవర్ చేశారు.

వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన నాయకుడిగా రికార్డు..

దీంతో దేశంలోనే ఏ రాజకీయ నాయకుడు ఇన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేయలేదని వైసీపీ నేతలు వెల్లడించారు. ముఖ్యంగా ఈ పాదయాత్రలో రావాలి జగన్-కావాలి జగన్ పాట ప్రజల్లోకి బలంగా దూసుకెళ్లింది. ఈ పాదయాత్రతో 2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 151 నియోజకవర్గాల్లో విజయదుందుభి మోగించారు. ఇక 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 22 స్థానాల్లో గెలుపు బావుటా ఎగరేసి ఘన విజయం సాధించారు. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంచేశారు. తన పాలనలో నవరత్నాల పేరుతో ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి ప్రజాదరణ పొందారు. అయితే 2024 ఎన్నికల్లో మూడు పార్టీలు జతకట్టడంతో పాటు ప్రభుత్వంపై విష ప్రచారం చేయడంతో పరాజయం పొందాల్సి వచ్చింది.

మరింత బలంగా జగన్ పాదయాత్ర 2.0..

దీని కారణంగా వైసీపీ క్యాడర్ కొంత నిరాశలో ఉన్నారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం దొంగ కేసులతో కార్యకర్తలు, నేతలను తీవ్ర ఇబ్బందులు పెడుతుండటంతో అధినేత జగన్ వారికి అండగా నిలిచేందుకు నేరుగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ప్రజా సంకల్పయాత్ర 2.0 చేయాలని నిర్ణయించారు. ఈసారి గతంలో కంటే బలంగా పాదయాత్ర చేయాలని డిసైడ్ అయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో తీవ్రంగా విఫలం కావడంపై గళం ఎత్తనున్నారు. 2014-19 టీడీపీ ప్రభుత్వం కంటే ఈసారి ప్రజలు ఇంకా ఎక్కువ కష్టాలు పడుతున్నారని.. వారికి అండగా నిలవడానికే జగన్ మరోసారి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. తన పాదయాత్ర ద్వారా ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడంతో ప్రజలకు తాను అండగా ఉంటానని భరోసా కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ చేపట్టబోయే పాదయాత్ర 2.0 ఏపీ రాజకీయాల్లో బలమైన ప్రభావం చూపనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.