వైఎస్ అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ రావడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. విపక్షాల దారుణ విమర్శల నేపథ్యంలో అవినాశ్ రెడ్డికి ఊరట లభించడం.. వైసీపీకి ఇంకా పెద్ద ఊరటగా భావించొచ్చా.?
నిజానికి, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో బెయిల్ లభించింది.. షరతులకు లోబడి మాత్రమే. అది కూడా ముందస్తు బెయిల్. ‘అరెస్టు చేయాల్సి వస్తే, 5 లక్షల పూచీకత్తుతో బెయిల్ మీద విడుదల చేయాలి..’ అని కూడా న్యాయస్థానం పేర్కొంది.
అంటే, ఇంకా వైఎస్ అవినాశ్ రెడ్డికి అరెస్టు భయం వుందనే కదా అర్థం.? అయితే, ఇక్కడో కీలక విషయం గురించి మాట్లాడుకోవాలి. వైఎస్ అవినాశ్ రెడ్డి బెయిల్ విషయమై జరుగుతున్న రగడకు, తెరవెనుకాల రాజకీయ ఒత్తిళ్ళే కారణమంటూ టీడీపీ అనుకూల మీడియా నానా యాగీ చేసింది.
ఈ యాగీపై హైకోర్టు వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అద్గదీ అసలు విషయం. అక్కడే వైసీపీకి, వెకేషన్ బెంచ్ తీర్పు బాగా నచ్చేసింది. వ్యవస్థల్ని భ్రష్టు పట్టించేలా టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా వ్యవహరిస్తోందనే విషయాన్ని వైసీపీ రాజకీయంగా ఎలివేట్ చేయగలుగుతోంది.
కానీ, గతంలో న్యాయమూర్తులపైనా.. న్యాయస్థానాల తీర్పులపైనా.. వైసీపీ శ్రేణులే జుగుప్సాకరమైన విమర్శలు చేశాయి. అప్పట్లో అరెస్టులు కూడా జరిగాయ్.!