వై ఏపీ నీడ్స్‌ జగన్‌… ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే వైనాట్ – 175 అనే నినాదంతో రాబోయే ఎన్నికల్లో లక్ష్యం పెట్టుకున్న అధికార వైసీపీ… తదనుకుణంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుంది. ఇదే సమయంలో అవినీతి కేసులో ప్రధాన ప్రతిపక్ష నేత ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ కొత్త కొత్త కార్యక్రమం చేపట్టనుంది.

శాసనసభ సమావేశాలు బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో ఇక గేర్‌ మార్చాల్సిన సమయం ఆసన్నమైందని పార్టీ నేతలకు జగన్ దిశా నిర్దేశం చేశారు. ఇన్ని రోజులు చేసిన ప్రచారం, గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ఒక ఎత్తు కాగా శాసనసభ సమావేశాలు ముగిశాక నిర్వహించే కార్యక్రమాలు, ఎన్నికలకు సన్నద్ధమయ్యే తీరు మరొక ఎత్తు అని పేర్కొన్నారు.

తాజాగా తాడేపల్లిలో పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఎన్నికలకు సిద్ధం కావాలంటూ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్ చార్జ్ లు, కోఆర్డినేటర్లకు వైసీపీ అధినేత జగన్ హితబోధ చేసారు. రాబోయే 6 నెలలు అత్యంత కీలకం అని గుర్తుచేశారు. ముఖ్యంగా “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం ద్వారా పార్టీపై సానుకూల పరిస్థితి ఉన్నట్టు తేలిపోయిందని, అందుకే ప్రతిపక్షాలన్నీ కట్టగట్టుకుని వస్తున్నాయని జగన్ చెప్పారు.

ఈ సమయంలో అతి ముఖ్యంగా ఇప్పటికే ప్రకటించిన “జగనన్న ఆరోగ్య సురక్ష” కార్యక్రమంతోపాటు, ఎన్నికల ఏడాదిలో “వై ఏపీ నీడ్స్‌ జగన్‌?” అనే కొత్త కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నట్టు సీఎం జగన్ నేతలకు తెలిపారు. ఈ సందర్భంగా… ఏపీలో మరోసారి వైసీపీ ప్రభుత్వమే రావాలని తెలిపిన ఆయన… రాకపోతే ఏమవుతుంది, వస్తే ఏమవుతుంది అనే విషయాలను ప్రజలకు వివరించేదే ఈ కార్యక్రమం అని స్పష్టం చేశారు.

జగనన్న సురక్ష ఏవిధంగా విజయవంతం అయ్యిందో అదే రకకంగా “జగనన్న ఆరోగ్య సురక్ష” కూడా విజయవంతం చేయాలని, దీని ద్వారా ప్రభుత్వంపై మరింతగా సానుకూలత పెరుగుతుందని అన్నారు. ఇదే సమయంలో 175కు 175 స్థానాల్లో గెలుపు ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించిన జగన్… “వైనాట్‌ 175” సాధ్యమే అని అన్నారు. ఇప్పుడు క్షేత్రస్థాయిలో అందుకు తగ్గ సానుకూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టే ఇది సాధ్యం అని స్పష్టం చేశారు.

అనంతరం టిక్కెట్ల ప్రస్థావన తెచ్చిన జగన్.. చెప్పాలనుకున్న విషయం సూటిగా సుత్తిలేకుండా చెప్పారు. టికెట్లు రానంత మాత్రాన సిట్టింగ్ లు బాధపడొద్దని హింటిచ్చిన జగన్.. ఇప్పటికే ఇన్ చార్జ్ లుగా ఉన్నవారి స్థానాల్లో కూడా మార్పులు ఉంటాయని స్పష్టం చేశారు. అసలు జుట్టంటూ ఉంటే ఏ ముడైనా వేసుకోవచ్చని, ముందు పార్టీ గెలుపు కోసం అందరూ కృషి చేయాలని చెప్పారు. టిక్కెట్లు ఇవ్వనంత మాత్రాన వాళ్లు నా వాళ్లు కాకుండాపోరు అంటూ ఈ సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.