ఏపీ రాజకీయల్లో పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం జ్రౌగుతుందని వైఎస్ జగన్ నిత్యం చెప్పేవారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యధికారంలో బలమైన వాటా ఇస్తూ వారిని అన్ని రకాలుగానూ ప్రోత్సహించారు. అయితే.. అది కొంతమంది నాయ్కులు గతం మరిచి చేజార్చుకుంటున్నారనే చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి.
అవును… రాజకీయాల్లో గెలుపోటములు అత్యంత సహజం. కానీ… అధికార పక్షం వైపు మాత్రమే ఉండాలి.. ప్రజా తీర్పుతో మాకు సంబంధం లేదనుకునే నాయకులు.. అలాంటి వారికి గాడ్ ఫాదర్ గా ఉండే అధినేతలూ ఉన్నంత కాలం రాజకీయాల్లో జంపింగ్ లు మరీ ఎక్కువగా సాగుతాయని అంటుంటారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు వైసీపీ నేతలు పక్క చూపులు చూస్తున్నారంటూ జరిగిన ప్రచారానికి తాజాగా బలం చేకూరింది. ఇందులో భాగంగా… వైసీపీ రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్ రావు ఈ రోజు వైసీపీకి రాజీనామా చేశారు. సైకిల్ ఎక్కబోతున్నారు!
ఇది వైఎస్ జగన్ హయాంలో జరిగి ఉంటే… “అప్రజాస్వామికంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న జగన్” అని కనిపించే శీర్షికలు కాస్తా ఇప్పుడు “వైసీపీకి బిగ్ షాక్” అని కనిపిస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంటే… వీరిద్దరూ రాజీనామా చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లివెత్తుతున్నాయి.
ఈ అవకాశం ఇచ్చినవారి నమ్మకాన్ని ఇది అవహేలన చేయడమే అనే కామెంట్లు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో స్పందించిన వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా… ఈ సందర్భంగా రాజీనామా చేసిన వారితో పాటు.. ప్రజానికానికి కూడా పరోక్షంగా ఒక క్లారిటీ ఇచ్చారు.
ఈ సందర్భంగా స్పందించిన పేర్ని నాని… “ఈరోజు ఇద్దరు రాజ్యసభ సభ్యులతో రాజీనామా చేయించారు.. ఈ ఇద్దరి బీసీల స్థానంలో సతీశ్, రాకేశ్ లు రాజ్యసభకు ఎందుకు వస్తున్నారో అందరికీ తెలుసు.. ఖాళీ అయిన స్థానాల్లో బీసీ, ఎస్సీలను పంపగలరా? దమ్ముందా? దేశంలో మత్స్యకారుడుని రాజ్యసభకు పంపిన ఏకైక వ్యక్తి జగన్” అన్నారు.
పేర్ని నాని లెవనెత్తిన ఈ అంశాలు అత్యంత కీలకమైనవనే విషయాన్ని ఆయా సామాజికవర్గాల ప్రజలు, వెనుకబడినవారికి రాజ్యాధికారంలో బలమైన స్థానం దక్కాలని చెప్పేవారు దీన్ని గమనించాలని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా… అటు చంద్రబాబుతో పాటు ఇటు మోపిదేవీ ఆత్మపరిశీలన చేసుకోవాలని నొక్కి చెబుతున్నారు.
మరి ఓ బీసీ సామాజికవర్గానికి (మత్స్యకారుడు)ని జగన్ రాజ్యసభకు పంపితే.. అతను అధికార పార్టీతో అంటకాగాలని ఫిక్సయితే.. ఇప్పుడు రాజ్యసభలో ఆ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి లేకుండా చేసి, తన స్వార్థం తాను చూసుకుంటే.. ఆ స్థానాన్ని బాబు మరో అగ్రవర్ణాలని చెప్పుకునేవారికి ఇచ్చేస్తుంటే.. దీనిపై ఎవరు ఆలోచించుకోవాలి.. తప్పెవరిదని అనాలి?
ఆ సంగతి అలా ఉంటే… మోపిదేవి వెంటకటరమణ పార్టీని వీడి వెళ్లిపోయినంత మాత్రన్న, బీద మస్తాన్ రావు పార్టీని వదిలేసినంత మాత్రాన్న వచ్చే నష్టం ఏమీ లేదనేది వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్నమాట. వీరిలో ఒక్కరికి కూడా ప్రజల్లో పలుకుబడి అంత లేదన్నది పలువురు ప్రజానికం బలంగా నొక్కి చెబుతున్న కామెంట్ అని అంటున్నారు.
ఉదాహరణకు మోపిదేవి వెంకటరమణ విషయానికొస్తే… ఆయన ఎమ్మెల్యేగా ఓటమిపాలైన తర్వాత ఆయనను ఎమ్మెల్సీ చేసి మంత్రిపదవి ఇచ్చారు జగన్. అనంతరం రాజ్యసభకు పంపించారు! ఇక బీదా మస్తాన్ రావు పూర్తిగా తన వ్యాపారాల కోసమే రాజకీయాల్లోకి వచ్చారనేది బహిరంగ రహస్యం అనేది రాజకీయ వర్గాల్లో ఎప్పటినుంచో చర్చ జరుగుతున్న విషయం.
ఇక, వీరికి ప్రత్యేకంగా సొంత నియోజకవర్గాలంటూ ఏమీ లేవని.. గతంలో పోటీ చేసిన నియోజకవర్గాలకు వెళ్లినా వీరిని పరిగణలోకి తీసుకునే ప్రజానికం అత్యల్పం అని చెబుతున్నారు. అలాంటి నేతలు పార్టీని వీడినంత మాత్రన్న వైసీపీకి వచ్చిన నష్టం ఏమీ లేదని.. పైగా ప్రజల్లో పలుకుపడి ఉన్న మరికొంతమంది కొత్త నేతలకు అవకాశం రానుందని నొక్కి చెబుతున్నారు.
ఏది ఏమైనా… ఏపీ రాజకీయాల్లో కమర్షియల్ రోజులు వచ్చేశాయని అంటున్నారు పరిశీలకులు. అమ్మకాలు, కొనుగోళ్లకు తెరలేపుతూ బాబు మార్కు రాజకీయం ఏపీ రాజకీయ తెరపై దర్శనమిస్తుందని అంటున్నారు. సుద్ధులు చెప్పే డీసీఎం ఎక్కడ అని నిలదీస్తున్నారు!!