వైసీపీ నేతల స్పీడుకు బ్రేకులే ఉండట్లేదు. పదవుల్లో లేనివారే చకచకా పనులు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. అలాంటిది పదవుల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎలా ఉంటారో చెప్పాలా. ఎవరికివారు ప్రజల్లో, హైకమాండ్ వద్ద మంచి పేరు తెచ్చుకోవడానికి నువ్వా నేనా అన్నట్టు పనిచేస్తున్నారు. ఈ పోటీయే ఒక్కోసారి నేతలు మధ్యన విబేధాలను కలిగిస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచినా కొత్త వ్యక్తుల్లో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఒకరు. సిట్టింగ్ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు మీద గెలవడంతో ఈయన బాగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు మంచి పనితనం ప్రదర్శిస్తూ ఆ పాపులారిటీని మరింత పెంచుకుంటున్నారు.
అదే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలకు సమస్యగా మారింది. ఎంపీగారి మంచితనంతో తమకు పెద్ద చిక్కే వచ్చి పడిందని ఫీలవుతున్నారు చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీ. ఎమ్మెల్యేగా వైసీపీలో విడదల రజినీకి సెలబ్రిటీ హోదా ఉంది. చిలకలూరిపేటలో అయితే అనతికాలంలోనే బోలెడంత క్రేజ్ తెచ్చుకున్నారు. గెలిచింది జగన్ ఛరీష్మాతోనే అయినా తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందట. కారణం వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.
మొదటి నుండి శ్రీకృష్ణదేవరాయలుకు, విడదల రజినీకి కొంత గ్యాప్ ఉంటూనే ఉంది. ఎంపీగారు తనను లెక్కచేయట్లేదని, ప్రోటోకాల్ పాటించట్లేదని ఎమ్మెల్యేగారి బాధ. గతంలో పలుసార్లు ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగాయి కూడ. సీఎం జగన్ ముందున్న సొంత పార్టీ సమస్యల ఫైళ్లలో వీరి ఫెయిల్ కూడ ఉంది. అవతల ఎమ్మెల్యే రజినీ ఎంతగా ఆక్షేపించినా ఇవతల ఎంపీ తగ్గట్లేదట. నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పేరు తెచ్చేసుకుంటున్నారు.
నరసారావుపేట లోక్ సభలోని ఏడు నియోజకవర్గాలను బ్రహ్మాండంగా కవర్ చేస్తున్నారు ఆయన. ఏ అసెంబ్లీ నుండైనా సమస్య ఉంది అంటూ జనం వస్తే ఈజీగా అపాయింట్మెంట్ ఇస్తూ వీలైనంతవరకు పరిష్కారాలు చూపిస్తున్నారట. ఎమ్మెల్యేల అపాయింట్మెంట్ దొరుకుతుందో లేదో తెలీదు కానీ వెళితే ఎంపీగారిని మాత్రం తప్పకుండా కలవచ్చని అక్కడి జనాల్లో ఓ అభిప్రాయం ఏర్పడిందట. ఇంతకీ ఎంపీ దగ్గరికి ఎక్కువగా వెళుతున్న జనం ఎక్కడివారో తెలుసా.. చిలకలూరిపేట వాసులేనట. ఇలా తన నియోజకవర్గ ప్రజలు పనుల కోసం తన వద్దకు రాకుండా ఎంపీ దగ్గరకి వెళుతుండటంతో తన క్రెడిట్ పోతోందని ఎమ్మెల్యే ఫీలైపోతున్నారట. ఈ సమస్య ఎలా ఉన్నా ఎంపీ మూలంగా ప్రజల సమస్యలు తీరుతున్నాయంటే ఆనందించదగిన విషయమే కదా.