ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంత బిజీనో చెప్పక్కర్లేదు. నిత్యం సంక్షేమ పథకాల అమలుతో, అధికారులు, మంత్రులతో సమీక్షలతో కష్ణం తీరిక లేకుండా ఉంటున్నారు ఆయన. చుట్టూ ఉన్న కోద్ధిమంది నేతలతో తప్ప మిగిలిన లీడర్లతో మాట్లాడే గ్యాప్ కూడ లేదు ఆయనకు. అందుకే గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలను కూడ ఇప్పటి వరకు పూర్తిగా కలవలేకపోయారు. ఇక ఎమ్మెల్యేలైతే ముఖ్యమంత్రిని కలవాలని, సమస్యలు చెప్పుకోవాలని చాలానే ట్రై చేశారు. కానీ కుదరట్లేదు. నెలల తరబడి ప్రయత్నించినా ఆయన అపాయింట్మెంట్ దొరకడం కష్టంగా ఉంది. మొదట్లో ఎమ్మెల్యేలకు కూడ అపాయింట్మెంట్ ఇవ్వరా అంటూ నొచ్చుకున్న వారు మెల్లగా అలవాటుపడిపోయారు. మనం అనుకున్నప్పుడు కాదు ఆయన అనుకున్నప్పుడే కలుస్తారని సైలెంట్ అయిపోయారు.
అయితే ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రిని కలవాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు చాలా మంది ఎమ్మెల్యేలు. ఉన్న పలుకుబడి మొత్తాన్ని వాడుతూ అపాయింట్మెంట్ సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే వచ్చిన కష్టం అంత పెద్దది మరి. అది కూడ జగన్ తీసుకున్న నిర్ణయం మూలంగానే వచ్చిందట. జగన్ త్వరలో రాష్ట్రంలోని జిల్లాల సంఖ్యను పెంచనున్నారు. ఒక్కొక పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కొక జిల్లా చేయనున్నారు. దీంతో కొత్తగా 12 లేదా 13 జిల్లాలు ఏర్పడనున్నాయి. అప్పుడు 25 లేదా 26 జిల్లాలు అవుతాయి. ఇలా చేయడం మూలాన పాలన సులభతరం కావడం, అభివృద్ధి వేగం అందుకోవడం, ఆశావహులకు టికెట్లు దక్కడం లాంటి మంచి ప్రయోజనాలు చాలానే ఉన్నాయి.
అయితే కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మాత్రం ఈ ప్రక్రియ ఆందోళలను కలిగిస్తోంది. కొత్తగా జిల్లాలు ఏర్పడితే ప్రజెంట్ ఉన్న నియోజకవర్గాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రాంతాలు కొన్ని పాత నియోజకవర్గాల నుండి విడిపోయి కొత్తగా ఏర్పడనున్న జిల్లాల్లో కలుస్తాయి. అలా కలిస్తే ఓటు బ్యాంకు కూడ చీలుతుంది. ఒక జిల్లాలో ఉన్న ఓటర్లు ఇంకో జిల్లాకు మారిపోతారు. అప్పుడు చీలిపోతున్న ప్రాంతాల్లోని సిట్టింగ్ ఎమ్మెల్యేల కేడర్ వేరొక జిల్లాలోకి, అసెంబ్లీ స్థానంలోకి వెళ్లిపోతుంది. అలా చీలిన చోట కొత్తగా వేరే జిల్లా నుండి కేడర్ వచ్చి చేరుతుంది. ఆ కేడర్ వైసీపీ కేడర్ అయినా తమకు సహరిస్తారో లేదో అనే అనుమానం నెలకొంది ఎమ్మెల్యేల్లో. ఒకవేళ కలిసే ప్రాంతం టీడీపీ ప్రభావిత ప్రాంతమైతే మొదటికే మోసం వస్తుందని అంటున్నారు.
అలా జరిగితే తమకు ప్రత్యర్థులుగా ఉన్న టీడీపీ నేతలు బలపడిపోతారని, అప్పుడు ఉన్న కేడర్ పోయి, తమది కానీ కేడర్ వచ్చి చేరితే తీవ్రంగా నష్టపోతామని, అది రాబోయే ఎన్నికల్లో గెలుపొటమటలను ప్రభావితం చేస్తుందని కంగారుపడుతున్నారట. అంతేకాదు.. జిల్లా కేంద్రాల ఏర్పాటులో కూడ డిమాండ్లు వినబడుతున్నాయి. తమ నియోజకవర్గాన్నే కేంద్రంగా చేయాలని సొంత పార్టీ నేతలే పోటీకి వస్తున్నారు. దీంతో ఈ సమస్యలన్నీ జగన్ వద్ద చెప్పుకుని పరిష్కారం అడగాలని చూస్తున్నారట. అందుకే ఉన్నపళంగా సీఎం అపాయింట్మెంట్ కావాలని పెద్ద లీడల మీద ఒత్తిడి చేస్తున్నారట కొందరు ఎమ్మెల్యేలు.