ఆ వైసీపీ ఎమ్మెల్యేలు టిక్కెట్లను వద్దనుకుంటున్నారట.!

‘ఈసారి నాకు టిక్కెట్ వద్దు.. నా కుమారుడికి టిక్కెట్ ఇవ్వండి..’ అంటూ పలువురు వైసీపీ సీనియర్ నేతలు, అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారన్న వార్త ఈనాటిది కాదు. మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి పేర్ని నాని.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలానే వుందంటూ ఆ మధ్యన ప్రచారం జరిగింది.
‘ఈసారికి మీరే పోటీ చేయాలి.. ఆ తర్వాత చూద్దాం..’ అని కొందరు సీనియర్ నేతల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారించినట్లు కూడా అప్పట్లో వార్తలొచ్చాయి. రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాలి. ఇది అందరూ చెప్పే మాటే. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు గత కొంతకాలంగా అనూహ్యమైన రీతిలో టర్న్ అవుతున్నాయి.
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు పూర్తిగా ఏడాదిన్నర సమయం కూడా లేదు. ఈలోగా, వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు అధినాయకత్వానికి కొంత ఆందోళన కలిగిస్తున్నమాట వాస్తవం. 175కి 175 సీట్లూ కొల్లగొట్టేయాలనే ఆలోచనతో వున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అది సాధ్యమేనా.? అన్నది వేరే చర్చ. ఆ కాన్ఫిడెన్స్ అయితే వుండాలి.
అధినేత గట్టి నమ్మకంతోనే వున్నారు.. కానీ, ముఖ్య నాయకులే.. నమ్మకం కోల్పోతున్నారు. తమ వారసుల్ని తీసుకురావాలని సీనియర్ నేతలు భావిస్తోంటే, వారి ఆలోచనలపై ముఖ్యమంత్రి నీళ్ళు చల్లేసరికి.. సహజంగానే ప్రత్యామ్నాయ ఆలోచనల్ని ఆయా నాయకులు చేసుకోవడం మొదలు పెట్టేస్తారు. అదే జరుగుతోంది కూడా.!
గత కొద్ది రోజులుగా వైసీపీలో యువ నాయకత్వంగా చెప్పబడుతున్నవారంతా సైలెంటయిపోయారు. సోషల్ మీడియాలోనూ వారి కార్యకలాపాలు పెద్దగా కనిపించడంలేదు. సోకాల్డ్ సీనియర్ నేతలు కూడా, గతంలో పనిచేసినంత ఉత్సాహంగా.. ఇప్పుడు కనిపించడంలేదు విపక్షాల్ని డీల్ చేసే విషయంలో.
ఇదంతా దేనికి సంకేతం.? డజనుకు పైగా సీనియర్ నేతలు తమకు టిక్కెట్లు వద్దని చెప్పేశారంటూ తాజాగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవమెంత.? దీని వెనుక అసలు మతలబు ఏంటి.?