వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారనీ, దమ్ముంటే టీడీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలూ రాజీనామా చేయాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసురుతున్నారు.!
2019 ఎన్నికల్లో వైసీపీ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకురాలేదు. అమరావతిని అభివృద్ధి చేస్తామనీ, అత్యద్భుతమైన రాజధానిగా నిర్మిస్తామని చెప్పి కదా వైసీపీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు హయాంలో కేవలం గ్రాఫిక్స్‌లో రాజధానిని చూపించారనీ, తాము అధికారంలోకి వస్తే అసలు సిసలు రాజధానిని అమరావతిలో నిర్మించి చూపిస్తామని స్వయానా వైఎస్ జగన్ చెప్పారు.
అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పాట పాడి, మొత్తంగా రాష్ట్రానికి రాజధాని వుందో లేదోనన్న అయోమయాన్ని అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సృష్టించారన్నది బహిరంగ రహస్యం. సరే, మూడు రాజధానులకు అనుగుణంగా వైసీపీ తగిన కార్యాచరణ చేపడితే, దాన్ని తప్పు పట్టడానికి వీల్లేదు.
మూడు ప్రాంతాలకు మూడు రాజధానులు.. కాన్సెప్ట్ మంచిదే. కానీ, గడచిన మూడున్నరేళ్ళలో రాజధాని పేరుతో వైసీపీ చేసిన అభివృద్ధి ఏంటన్న చర్చ ఖచ్చితంగా జరుగుతుంది. మరి, ఆ చర్చలో వైసీపీ చెప్పడానికి ఏమైనా వుంటుందా.? ప్చ్.. అంతా ‘జీరో’.కోర్టు వివాదాల్ని సాకుగా చూపితే సరిపోదు. మూడు రాజధానుల్లో అమరావతి కూడా ఒకటి గనుక, ఆ అమరావతిని అభివృద్ధి చేయాల్సింది పోయి, ‘స్మశానం, ఎడారి..’ వంటి మాటలు వైసీపీ చెప్పడమే ఘోర తప్పిదం.
ఇప్పుడు ఎమ్మెల్యే రాజీనామాతో వైసీపీ మరింత ఇరకాటంలో పడుతుంది. ఇది విపక్షాలకే ఆయుధమవుతుంది.