కిడారి పార్టీ ఫిరాయింపు ఖరీదెంతో తెలుసా?

కేవ‌లం డ‌బ్బు కోస‌మే వైసిపి ఎంఎల్ఏ కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు తెలుగుదేశంపార్టీలోకి ఫిరాయించారా ? అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. మొన్న ఆదివారం మ‌ధ్యాహ్నం ఎంఎల్ఏ అర‌కు ఎంఎల్ఏ కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు తో పాటు మాజీ ఎంఎల్ఏ సివేరి సోమ‌ల‌ను మావోయిస్టులు కాల్చి చంపిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. చంపేముందు మావోయిస్టులు పై ఇద్ద‌రితో కాసేపు మాట్లాడారు. మావోయిస్టుల‌కు, పై ఇద్ద‌రు నేత‌లు మాట్లాడుకున్న‌పుడు స్ధానిక గిరిజ‌నులు కొంద‌రు అక్క‌డే ఉన్నారు.

త‌మ‌కు కావాల్సిన స‌మాచార‌న్ని మావోయిస్టులు రాబట్టుకున్న త‌ర్వాత ఇద్ద‌రినీ పాయింట్ బ్లాంక్ లో నుండే కాల్చేశారు. అప్ప‌ట్లో వారి మధ్య జ‌రిగిన సంభాష‌ణ‌లు ఇపుడు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దాని ప్ర‌కారం పార్టీ ఫిరాయించినందుకు త‌న‌కు రూ. 12 కోట్లు ముట్టిన‌ట్లు అంగీక‌రించార‌ట‌. దాంతో పాటు మైనింగ్ లైసెన్సులు కూడా ఇప్పించారంటూ చెప్పార‌ట‌. అందుకోసమే తాను పార్టీ ఫిరాయించిన‌ట్లు కూడా అంగీకరించార‌ని గిరిజ‌నులు చెబుతున్నారు.

ఏజెన్సీ ప్రాంతంలో మైనింగ్ కు అవ‌స‌ర‌మైన లైసెన్సుల‌ను మంత్రి నారా లోకేషే ఇప్పించార‌ని కూడా చెప్పార‌ట‌. తాను కొనుక్కున్న రెండు పెద్ద కార్ల‌ను కూడా ట్రైకార్ ద్వారా లోన్ తీసుకునే స‌బ్సిడీపై కొనుగోలు చేసిన‌ట్లు అంగీక‌రించారు. గిరిజ‌న ప్రాంతాల్లో మైనింగ్ చేయ‌కూడ‌ద‌ని తెలీదా అన్న ప్ర‌శ్న‌కు తెలుస‌ని ఒప్పుకున్నార‌ట‌. తాను త‌ప్పులు చేశాన‌ని క్ష‌మించి వ‌దిలేయాల‌ని, వ‌దిలేస్తే అన్నింటినీ మూసేసి రాజ‌కీయాల నుండే త‌ప్పుకుంటాన‌ని బ్ర‌తిమ‌లాడుకున్నార‌ట‌.

త‌ర్వాత సోమ మాట్లాడుతూ, ఎంఎల్ఏతో క‌లిసి తిర‌గాల‌ని త‌న‌ను పార్టీనే ఆదేశించింద‌ని చెప్పార‌ట‌. మైనింగ్ కు అవ‌స‌ర‌మైన పెట్టుబ‌డి అంతా ఎంఎల్ఏనే పెట్టి లాభాల్లో 25 శాతం వాట ఇచ్చేట్లు ఒప్పందం కుదిరింద‌ని కూడా అంగీక‌రించార‌ట‌. పై ఇద్ద‌రు నేత‌ల‌తో మాట్లాడిన త‌ర్వాత మావోయిస్టులు ఇద్ద‌రినీ కాల్చి చంపేశారు. ఐదు రోజుల త‌ర్వాత వారి సంభాష‌ణ‌లు వెలుగు చూడ‌టం క‌ల‌కలం రేపుతోంది.