వైసీపీ ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే, శాంతి భద్రతలున్నాయనగలమా.?

YSRCP MLA :  అధికార వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై గ్రామస్తులు దాడికి దిగిన ఘటన ఏలూరులో జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడు గంజి ప్రసాద్ ఏలూరు జిల్లాలో హత్యకు గురయ్యారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎమ్మెల్యే వెళితే, మృతుడి బంధువుల, సన్నిహితులు, స్థానిక వైసీపీ నాయకులే ఎమ్మెల్యేని అడ్డుకున్నారు.

పార్టీలో గ్రూపుల్ని ఎమ్మెల్యే ప్రోత్సహించారనీ, ఆ గ్రూపు తగాదాల వల్ల ఎమ్మెల్యే అనుచరుడు, ఎంపీటీసీ ఒకరు ఈ హత్యకు తెగబడ్డారనీ గంజి ప్రసాద్ వర్గం ఆరోపిస్తోంది. ఇదెక్కడి పంచాయితీ.? మామూలుగా అయితే పార్టీల వారీగా జనాన్ని విడదీసి.. రాజకీయాలు చేస్తుంటాయి రాజకీయ పార్టీలు.

చిత్రంగా ఒకే పార్టీలో నాయకులు గ్రూపుల వారీగా విడిపోయి చంపేసుకోవడమేంటి.? ఆ గ్రూపు తగాదాలకు ఎమ్మెల్యే ప్రోత్సాహమందించడమేంటి.? ఇవన్నీ ఓ యెత్తు అయితే, గ్రామస్తుల దాడి నుంచి ప్రాణ భయంతో ఎమ్మెల్యే ఓ స్కూలులో తలదాచుకునే పరిస్థితి రావడం ఇంకా దారుణం.

అధికార పార్టీ ఎమ్మెల్యేకే పోలీసులు సరైన రక్షణ కల్పించలేకపోతున్నారనీ, పోలీసు శాఖ పూర్తిగా నిర్వీర్యమైందనీ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ‘ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్’ అంటూ వైసీపీ పాలన మీద విపక్ష నేతలు మండిపడుతున్నారు.

కాగా, ఎమ్మెల్యేను విడిపించేందుకు అదనపు బలగాలను పంపిస్తున్నట్లు పోలీస్ ఉన్నత అధికారులు, పలువురు మంత్రులు వ్యాఖ్యానించడం.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా వుందో చెప్పకనే చెబుతున్నట్లుంది.