“ప్రజాకోర్టు” సాధారణంగా ఆర్.నారాయణమూర్తి సినిమాల్లోనూ, మావోయిస్టు బ్యాక్ గ్రౌండ్ ఉన్న సినిమాల్లోనూ వినిపించే మాట. ఒక్కమాటలో చెప్పాలంటే… ప్రజాకోర్టులు అనేవి మావోయిస్టుల పదజాలం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మావోయిస్టులు ప్రజా ప్రతినిదులపైనో లేకపోతే స్ధానిక నేతలపై ఉన్న ఆరోపణలపైన విచారణ చేస్తారు.
అవును… ప్రభుత్వానికి వ్యతిరేకంగా మావోయిస్టులు తీర్పు ఇవ్వడంతో పాటు స్పాట్ లోనే తమవైన శిక్షలు అమలు చేసేవే ప్రజాకోర్టులు! మావోయిస్టులు నిర్వహించే ప్రజాకోర్టులు చట్టవిరుద్ధం. వీటిని పోలీసులు అనుమతించరు. సాధారణంగా ఎవరి విషయంలో అయితే ప్రజాకోర్టును ఏర్పాటుచేశారో వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటమో లేకపోతే అక్కడికక్కడే శిక్షవేసేయటమో జరుగుతుంది.
మావోయిస్టులు నిర్వహించే ప్రజాకోర్టులో విచారణుండదు, వాదనలుండవు. కేవలం ఆరోపణలు వినిపిస్తారు తీవ్రతను బట్టి వెంటనే శిక్షను అమలుచేసేస్తారు. ఈమధ్య జరిగిన ప్రజాకోర్టంటే.. అరకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమాను మావోయిస్టులు కాల్చి చంపేయటమే. ఇవి అప్పట్లో సంచలనంగా మారాయి!
ఆ సంగతి అలా ఉంటే… తాజాగా పవన్ కల్యాణ్ కూడా ప్రజాకోర్టులు అంటూ ఒక మాట మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అరాచకాలకు వ్యతిరేకంగా తొందరలోనే జనసేన ఆధ్వర్యంలో ప్రజాకోర్టులు ఏర్పాటుచేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే పవన్ కు ప్రజాకోర్టులపై పూర్తి అవగాహన ఉండే ఈ మాట అన్నారా.. లేక, పదం బాగుందని వాడేశారా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
వైసీపీ నేతల అక్రమాలు, అవినీతి, దోపిడిపై ప్రజలకు తెలియజేయటానికే ప్రజాకోర్టులు నిర్వహించబోతున్నట్లు చెప్పారు. వారాహి యాత్ర పేరుచెప్పి ఇపుడు పవన్ ఊరూరా తిరిగి చేస్తున్నదదే కదా. సభ ఏదైనా.. సందర్భం మరేదైనా.. మైకందుకున్న ప్రతీ సారీ పవన్ చెప్పే మాట ఇదే కదా! పవన్ ఎక్కడ మాట్లాడినా, ఏమిమాట్లాడినా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడతారనేది కన్ ఫాం!
దీనికోసం వారాహి యాత్ర మాగ్జిమం! కారణం… పవన్ తాను అధికారంలోకి వస్తే ఏమి చేస్తాను అనేది చెప్పరు… జగన్ దిగిపోవాలి అంతే అదే తన తన లక్ష్యమని చెబుతుంటారు. తాజాగా జగన్ దిగిపోవాలి.. అయినా కూడా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు పోతాయని కంగారు పడకండి.. వాటిని కొనసాగిస్తాం అని ప్రకటించారు కూడా.
దీంతో విషయం అర్ధమయ్యింది కాబట్టి… ప్రజాకోర్టులు వంటి మాటలు మాట్లాడి, పోలీసులతో వాగ్వాదాలకు దిగి, అనంతరం పోలీసులు చెయ్యే కాలో ఎత్తితే మళ్లీ అదో పని అయ్యి… ఇదంతా అవసరమా అని అంటున్నారు పరిశీలకులు! ఉన్న సమయంలో వారాహియాత్రను సక్రమంగా వినియోగించుకుంటే సరిపోద్దని.. జగన్ పై విమర్శలు చేసినంత మాత్రాన్న ప్రజలు ఓటు వేయరనే విషయం గ్రహించాలని సూచిస్తున్నారు.