కర్నూలు వైసీపీలో వర్గ విబేధాలు నిన్న మొన్న వచ్చినవి కావు. ఎన్నికలు ముగిసిన కొన్ని రోజులకే అక్కడ అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. ప్రధానంగా నందికొట్కూరు నియోజకవర్గంలో పరిస్థితి చేయి దాటిపోతోందట. ఈ నియోజకవర్గంలో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ఆర్థర్ గెలిచారు. పేరుకు ఎమ్మెల్యేనే అయినప్పటికీ పవర్ మొత్తం నియోజకవర్గ ఇంఛార్జ్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి చేతుల్లోనే ఉంది. ఏ నియోజకవర్గంలో అయినా ఇంఛార్జ్ ఒకరు, ఎమ్మెల్యే ఇంకొకరు ఉండరు. ఒక వ్యక్తి చేతిలోనే రెండూ ఉంటాయి. కానీ నందికొట్కూరులో మాత్రం అంతా రివర్స్. ఆర్థర్ ఎమ్మెల్యే అయితే ఇంఛార్జ్ బైరెడ్డి. ఈ స్థానం రిజర్వ్ అయింది కాబట్టి సరిపోయింది కానీ జనరల్ స్థానం అయ్యుంటే బైరెడ్డి సిద్దార్థరెడ్డే బరిలోకి దిగేవారు. ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ పార్టీ పగ్గాలు ఆయన చేతుల్లోనే ఉన్నాయట.
ఇదే ఎమ్మెల్యే ఆర్థర్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతకాదన్నా తాను ఎమ్మెల్యే. ఎప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడు అయిన పార్టీలో తన మాట కూడ నెగ్గాలి. కీలక విషయాల్లో తన నిర్ణయం, చొరవ ఉండాలని ఆర్థర్ కోరుకుంటున్నారు. కానీ యువనేత బైరెడ్డి అంత అవకాశం ఇవ్వట్లేదట ఎమ్మెల్యేకు. పార్టీలోని కీలక పదవుల నుండి స్థానిక ఎన్నికల్లో టికెట్ల వరకు అన్నీ తన వారంవారీక్ దక్కేలా చేసుకున్నారట. పార్టీ పనులు, ఇతర కాంట్రాక్టులు కూడ ఆయన అనుచరులే తన్నుకుపోతున్నారని, ఈ డామినేషన్ మూలంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తనకు సరైన గుర్తింపు, గౌరవం దక్కట్లేదని వాపోతున్నారు. ఆయన బాధలో నిజం లేకపోలేదు. నందికొట్కూరులో వైసీపీ అంటే సిద్దార్థరెడ్డే అనే భావన ఉంది.
ప్రజలే కాదు పార్టీ నాయకులు, శ్రేణులు కూడ అదే ధోరణిలో ఉన్నారు. ఆర్థర్ కేవలం యాక్టింగ్ ఎమ్మెల్యే మాత్రమేనని అనుకుంటున్నారు. హైకమాండ్ సైతం అన్ని బాధ్యతలను సిద్దార్థరెడ్డికే ఇస్తోంది. సిద్దార్థరెడ్డి జగన్ కు అత్యంత నమ్మకస్థుడు. అందుకే ఆయన్ను ఎవరూ కాదనలేకున్నారు. ఆర్థర్ తన బాధను జిల్లా నేతల వద్దకు తీసుకెళ్లినప్పుడు మొదట్లో ఏదో ఒకటి చేస్తామని చెప్పిన వారందరూ బైరెడ్డి నొచ్చుకోవడంతో సైలెంట్ అయిపోయారు. పరిస్థితిని మార్చాలని ఎమ్మెల్యే అన్ని మార్గాల్లోనూ ట్రై చేసి విఫలమయ్యారు. అందుకే ఆయన ఇంకోదారి వెతుక్కున్నారని అంటున్నారు లోకల్ నాయకులు.
ప్రత్యర్థి పార్టీ అయినా తెలుగుదేశంతో ఆర్థర్ సన్నిహితంగా ఉంటున్నారట. ఆ పార్టీలోని నియోజకవర్గ స్థాయి నేతల నుండి చోటా మోటా లీడర్ల వరకు అందరూ ఎమ్మెల్యే పట్ల సానుకూలంగా ఉంటున్నారట. కలిసి నడిస్తే బైరెడ్డి స్పీడుకు బ్రేకులు వేయవచ్చని, ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని తెలుగుదేశం నేతలు ఎమ్మెల్యేకు భరోసా ఇచ్చారట. దీంతో ఎమ్మెల్యే సొంత వర్గాన్ని కూడగట్టుకునే పనిలో ఉన్నారని, ఇది వైసీపీకి ఒకింత నష్టం కలిగించే విషయమేనని అంటున్నారు పరిశీలకులు.