వైసీపీ ఎమ్మెలేకు ఆఫర్: 200 కోట్లా.. జగనా..?

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం, ఫలితాలు రావడం, గెలిచినవారు పదవులు చేపట్టడం జరిగిపోయినా… ఆ ఎన్నిక కలిగించిన ప్రకంపణలు మాత్రం ఇంకా కదులుతూనే ఉన్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి నాలుగు ఓట్లు క్రాస్ పడ్డాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ నాలుగు ఓట్లు ఫలానావారివని వైసీపీ ఓ లిస్ట్ చదివి వినిపించింది, వారిని పార్టీనుంచి సస్పెండ్ చేసింది. వారంతా బయటకువెళ్లి.. అబ్బే తాము టీడీపీకి ఓటువేయలేదు అంటూనే అధినేతను విమర్శిస్తున్నారు. ఫలితంగా వైకాపా నేతల కౌంటర్లకు బలవుతున్నారు. వారి సంగతి అలా ఉంచితే… ఓటు వేసిన ఆ నలుగురికే కాకుండా.. మరికొంతమందికి కూడా టీడీపీ ఆఫర్స్ ఇచ్చిందంట. రోజుకో ఎమ్మెల్యే బయటకు వచ్చి ఈ విషయాలు చెబుతున్నారు!

వైకాపా సస్పెండ్ చేసిన ఆ నలుగురు ఎమ్మెల్యేలతో పాటు మరికొందరికి కూడా టీడీపీ ఆఫర్ ఇచ్చినట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒకరి తర్వాత ఒకరు వైసీపీలో ఉన్నవారు నాకు ఆఫర్ వచ్చింది.. నాక్కూడా ఆఫర్ వచ్చింది అంటూ మీడియా ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా… తనకి 10కోట్ల ఆఫర్ వచ్చిందని.. సిగ్గు, శరం ఉంది కాబట్టి ఆ ఆఫర్ ని తాను తిరస్కరించానని చెప్పుకున్నారు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ఇదే క్రమంలో… తనకు కూడా ఫోన్ కాల్స్ వచ్చాయని, కానీ తాను జగన్ కే జై కొడతానని చెప్పానని, అదే చేశానని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే మద్దాలి గిరి! సరే వీరిద్దరూ ఒకరు జనసేన, మరొకరు టీడీపీ నుంచి వచ్చినవారు కాబట్టి… టీడీపీ ప్రయత్నాలేవో చేసింది అనుకుని సరిపెట్టుకున్నవారికి… తనకి కూడా ఆఫర్ వచ్చిందని చెబుతూ షాకిచ్చారు నిఖార్సైన వైకాపా ఎమ్మెల్యే ఒకరు!

అవును… ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థికి అనుకూలంగా ఓట్లువేయాలంటూ కోట్ల రూపాయల ఆఫర్ తో తనను కూడా ప్రలోభపెట్టాలని చూశారని.. కానీ వారికే వార్నింగ్ ఇచ్చి తాను ఫోన్ పెట్టేశానని చెప్పుకొచ్చారు వైసీపీ ఎమ్మెల్యే. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్… ఇంటికి పోలింగ్ ముందురోజు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారట. సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడారంట.. అక్కడినుంచే తనకు ఫోన్ చేసి పర్సనల్ గా మాట్లాడాలన్నారంట… కానీ… వారికి ఆ అవకాశం ఇవ్వని ఆర్థర్… తనవద్ద ఆటలు సాగవని చెప్పి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారంట. ఇది స్వయంగా ఆర్ధరే చెబుతున్న విషయం!

ఆ సంగతి అలా ఉంచితే… తనకు జగన్ పై ఎంత అభిమానం ఉంది.. డబ్బుకంటే జగన్ కే తన ప్రాధాన్యత అని చెప్పే ప్రయత్నంలో భాగంగా… “200 కోట్ల రూపాయలు ఓవైపు, జగన్ ఫొటో మరోవైపు పెడితే.. నేను జగన్ ఫొటోనే తీసుకుంటాను” అని బరువైన మాటలు చెప్పుకొచ్చారు ఆర్ధర్! మరి వరుసగా… ఇన్నేసి విషయాలు బయటకు వస్తున్నాయి కాబట్టి… జగన్ ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయించాలని అంటున్నారు విశ్లేషకులు. ఫలితంగా ఏపీలో కూడా ఓటుకు నోటు వ్యవహారాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు!