తప్పు మీద తప్పు.. మళ్ళీ మళ్ళీ అదే తప్పు.!

అధినేత మెప్పు కోసం ప్రయత్నించడం మినహా.. కాస్తంతైనా వైసీపీ నేతలు పార్టీకి, ప్రభుత్వానికి తమ చర్యల వల్ల నష్టం జరుగుతుందని ఆలోచించరా.? అధినేత వైఎస్ జగన్ తమకు పదవులు ఇచ్చారు గనుక, పదవులకు న్యాయం చేయకపోయినా ఫర్లేదు.. ప్రత్యర్థుల మీద ఏదో ఒకటి మాట్లాడేసి అధినేత మెప్పు పొందాలని అనుకుంటున్నారా.?

మొన్న మంత్రి అంబటి రాంబాబు.. నిన్న వాసిరెడ్డి సద్మ.. అసలేం జరుగుతోంది వైసీపీలో.! పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందన్న ప్రశ్నకు, ‘పవన్ నాలుగో పెళ్ళి చేసుకోనే లోపే..’ అంటూ బాధ్యతారాహిత్యమైన సమాధానమిచ్చారు జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. ఇదా పద్ధతి.?
నిజానికి, ఇలాంటి చర్యలతో జనసేన పార్టీకిగానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కిగానీ వైసీపీ చేసే నష్టమేమీ లేదు.

పైగా, జనసేనకు అది అదనపు అడ్వాంటేజ్ అవుతుంది. అదే సమయంలో, వైసీపీ ఇమేజ్ దారుణంగా పడిపోతుంది. ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుంది.
వాసిరెడ్డి పద్మ విషయానికొస్తే.. ఆమె మహిళా కమిషన్ ఛైర్ పర్సన్. పవన్ కళ్యాణ్ తన మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడారట.. స్టెప్నీ అని అన్నారట. అంతే, ఆయనకు నోటీసు పంపేశారు వాసిరెడ్డి పద్మ. పవన్ కళ్యాణ్‌కి ఒక్క నోటీసు ఇస్తే, అలాంటివి వేల నోటీసులు వైసీపీ నాయకులకు ఇవ్వాల్సి వస్తుందని వాసిరెడ్డి పద్మ ఎందుకు ఆలోచించలేకపోయారు.?
నిజానికి, ఈ తప్పు ముమ్మాటికీ వైసీపీ అధినాయకత్వానిదే.

పార్టీకి చెందిన ముఖ్య నాయకులపై వైసీపీ అధినాయకత్వానికి అదుపు వుండాలి. ఆయా నాయకుల చేష్టలతో పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలుగుతోందని గుర్తెరగాలి. లేదూ, భజన మండలితో ఆల్ ఈజ్ వెల్.. అని అధినాయకత్వం అనుకుంటే ఇక చేయడానికేమీ లేదు.. 2019 ఎన్నికల్లో చంద్రబాబు అనుభవించినట్లే.. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ కూడా అనుభవించాల్సి వస్తుంది.