మంత్రి రోజాకు జాలే లేదు… బాబు నవరంద్రాల్లో రక్తం అంట!

చంద్రబాబు పేరు చెబితే అంతెత్తున లేచే వైసీపీ నాయకుల విమర్శలు ఒకెత్తు.. ఒకప్పుడు బాబుతో కలిసి పనిచేసి ఆయన ప్రవర్తన, ఆలోచనా విధానం తెలిసినవారి విమర్శలు మరొకెత్తు. ఈ విషయంలో మొదటి రెండు స్థానాల్లో ఉంటారు మాజీ మంత్రి కొడాలి నాని.. మంత్రి ఆర్కే రోజా! ఈ విషయంలో మేనిఫెస్టోపై ఇప్పటికే కొడాలి డోస్ పూర్తవగా.. తాజాగా రోజా మొదలుపెట్టారు. రోహిణీ కార్తి ఎండల వేడికి ఏమాత్రం తగ్గకుండా చంద్రబాబుకు విమర్శల వడగాల్పులు తగిలించారు!

మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేసిన తొలివిడత మేనిఫెస్టోపై తాజాగా ఆర్కే రోజా మైకందుకున్నారు. తమ పాలన చూసి చంద్రబాబుకు నవ నాడులు చిట్లి పోతున్నాయి అంటూ.. మొదలుపెట్టడం మొదలుపెట్టడమే తీవ్రంగా మొదలుపెట్టిన రోజా… జగన్ నాలుగేళ్ల పాలనపై టీడీపీ విడుదల చేసిన ఛార్జ్‌ షీట్‌ వారి పిచ్చికి పరాకాష్ట అని ఫైర్‌ అయ్యారు. రాష్ట్రంలో యువతను చంద్రబాబు ఆదుకుంటాననడం పెద్ద జోక్‌ అని.. బాబు వస్తే జాబ్‌ వస్తుందంటూ గతంలో ఏపీ యువతను మోసం చేసిన విషయాన్ని గుర్తు చేశారు!

అనంతరం టీడీపీ తొలివిడత మేనిఫెస్టోపై స్పందించిన మంత్రి… గతంలో 600 హామీలు ఇచ్చి, ఆరు హామీలు కూడా నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు అని.. నాడు జగన్ ప్రవేశపెట్టిన “అమ్మఒడి” పథకాన్ని ఎగతాళి చేసి, ఇప్పుడు మళ్లీ ఆ పథకాన్నే పేరుమార్చి ఇస్తానని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. 15 ఏళ్లు సీఎంగా కొనసాగి, తీరా ఇప్పుడు మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తాను అంటే టీడీపీని నమ్మేవారు ఎవరూ లేరని మంత్రి రోజా స్పష్టం చేశారు. తమపార్టీ మేనిఫెస్టోని కూడా సొంతంగా తయారుచేసుకోలేక ఆ ఆరింటిలో మూడు వైసీపీ నుంచి, రెండు కర్ణాటక కాంగ్రెస్ నుంచి, ఒకటి కర్ణాటక బీజేపీ నుంచీ కాపీ కొటారని సెటైర్లు వేశారు!

ఇదే సమయంలో “సీఎం తొలి సంతకం” విలువ తెలియని వ్యక్తి చంద్రబాబని, అసలు ముఖ్యమంత్రి సంతకాలకున్న విలువ చంద్రబాబుకి తెలియదని రోజా దుబ్బయట్టారు. ఇదే గ్యాప్ లో బోండా ఉమ పేరు ప్రస్థావించిన రోజా… ఆస్తి కోసం కుటుంబీకులను వేధించిన వ్యక్తి, తమ గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఫైరయ్యారు.