హాట్ టాపిక్… వైసీపీ మేనిఫెస్టోలో కీలక అంశాలివే!

ప్రజల్లో నమ్మకం కలిగించుకోవడం ఏ రాజకీయ నాయకుడికైనా అత్యంత ముఖ్యం.. అదే ముఖ్యం! ఈ విషయంలో గత ఎన్నికల్లో నవరత్నాలు అంటూ జగన్ ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలుచేశారనే చర్చ ప్రజల్లో నడుస్తుంది. దీనికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసేందుకు వైసీపీ సిద్ధంగా ఉందనీ అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వైసీపీ మేనిఫెస్టోపై సర్వత్రా ఆసక్తి, కొందరిలో ఉత్కంట నెలకొన్న సంగతి తెలిసిందే.

దీంతో… అన్నీ అనుకూలంగా జరిగితే ఈ నెల 10న జరగబోయే సిద్ధం సభలో జగన్ మేనిఫెస్టోని విడుదల చేస్తారని అంటున్నారు. ఈ సభకు భారీ ఎత్తున కార్యకర్తలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా రాప్తాడు సభకు మించి కార్యకర్తలు తరలివచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ సమయంలో… ఆ సభ నుంచే మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. అయితే… అందులో ప్రధానంగా ఏయే అంశాలు ఉండొచ్చనే విషయంపై కీలక విషయాలు తెలుస్తున్నాయి.

ఇందులో భాగంగా… రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అలవిగాని హామీలు ఇచ్చే లక్షణం తనది కాదని జగన్ పలు మార్లు చెప్పిన నేపథ్యంలో… ఈసారి కూడా రైతు రుణమాఫీపై జగన్ పూర్తిస్థాయి హామీ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. హామీ ఇస్తే కచ్చితంగా నెరవేర్చాలి తప్ప.. అడిగిన మీడియాపై అరవకూడదు అని జగన్ నమ్ముతారనే విషయం 2014 ఎన్నికల సమయంలోనే ఏపీ ప్రజలు గ్రహించిన సంగతి తెలిసిందే.

అయితే… ప్రస్తుతం రైతులకు ఏడాదికి ఇస్తున్న రూ.13,500 భరోసా సొమ్మును మాత్రం పెంచే యోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఈ 13,500 ని 20,000 చేసే అవకాశం ఉందని సమాచారం. డ్వాక్రా రుణమాఫీ విషయంలోనూ గతంలో అనుసరించిన సానుకూల వైఖరినే జగన్ మరోసారి అవలంభించే అవకాశం ఉందని అంటున్నారు.

మరోపక్క అమ్మఒడి లబ్ధిని రూ. 15,000 నుంచి 20 వేలకు పెంచే అవకాశం ఉందని సమాచారం. ఇక జగన్ మార్కు పథకాల్లో ఒకటిగా నిలిచిన పించన్ ను రూ.3,000 నుంచి రూ.4,000 ను విడతల వారీగా పెంచనున్నారు. దీనితో పాటు ఈ ఐదేళ్లలో అమలుచేసిన నవరత్నాలను యదావిధిగా అమలు చేయడం.. లేదా, వాటిని లద్భిని పెంచడం చేస్తారని తెలుస్తుంది.

ఏది ఏమైనా… ప్రాక్టికల్ గా ఆలోచిస్తూ, వాటి అమలు పక్కాగా సాధ్యం అనుకున్నవి మాత్రమే ఇచ్చే ఆలోచన జగన్ చేస్తున్నారని తెలుస్తుంది. అన్నీ అనుకూలంగా జరిగితే… ఈ నెల 10న జరగనున్న సిద్ధం సభలో ఈ మేరకు మేనిఫెస్టో ప్రకటన ఉండొచ్చని సమాచారం.