జగన్ సర్కార్ మోడీకి సాగిలపడిపోయిందని మొదటి నుండి ఉన్న అపవాదు. కేంద్రం ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ప్రతిపక్షాలు ఇదే మాట అంటుంటాయి. కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయానికి మద్దతునిచ్చే జగన్ ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం ఒక్కటంటే ఒక్క ప్రయోజనాన్ని కూడ కేంద్రం నుండి పొందలేకున్నారని, దీని వెనుక పెద్ద చీకటి ఒప్పందం ఉందని అంటున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం తాము ఎవ్వరికీ రాలొగ్గాల్సిన అవసరంలేదని బుకాయించే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటప్పుడు మోడీ మీద పోరాడటానికి ప్రత్యేక హోదా, పోలవరం లాంటి పలు అంశాలున్నాయి పోరాడవచ్చు కదా అంటే సమాధానం ఉండదు.
ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ మోడీకి ఎదురుతిరగరనేది పచ్చి వాస్తవం. దీని వెనుక కారణామాలేమిటనేది పక్కనపెడితే వైసీపీ నేతలు దీన్ని ఒప్పుకుని తీరాల్సిందే. కానీ మాటి మాటికీ మోడీ అంటే తమకు భయం లేదని చెప్పుకోవడం భుజాలు తడుముకోవడంలానే ఉంటుంది. కనుక వైసీపీ నేతలు ఎంత వీలైతే అంత ఎక్కువ మోడీ మాటను ప్రస్తావించకపోవడం, కేంద్రం ముందు జగన్ ధైర్యాన్ని కొలిచి చెప్పకపోవడం మంచిది. కానీ వైసీపీ నేతలు అలా చెయ్యట్లేదు. కేంద్రం ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ జగన్ గురించి గొప్పలు చెబుతున్నారు. అదే పెద్ద పొరపాటు. తాజాగా అనకాపల్లి ఎమ్మెలేయ్ గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ మోడీ తమ నాయకుడికి పెద్ద లెక్క కాదని అనేశారు.
ఒకప్పుడు సోనియా గాంధీనే ఎదిరించి నిలిచారు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే లేకుండా చేశారు, మోడీని ఎదిరించే ధైర్యం ఉన్నవాడు అంటూ హైప్ ఇచ్చే ప్రయత్నం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అస్సలు ఒప్పుకునేది లేదని, జరగనివ్వమన్నట్టు మాట్లాడారు. జగన్ నామ్ కె వాస్తే రాసిన లేఖనే ఏదో బ్రహ్మాస్త్రం అన్నట్టు ఎలివేషన్ ఇచ్చారు. అలంటి లేఖలను గతంలో ఎందరో ముఖ్యమంత్రులు ఎన్నోసార్లు రాశారు కేంద్రానికి. వాటి వలన ఏం ఒరిగింది అంటే చెప్పడం కష్టం. అలాంటప్పుడు వైసీపీ నేతలు జగన్ లేఖను పట్టుకుని మోడీ మెడలు వంచేస్తాం అనే గొప్పలు చెప్పుకుంటే లేని తిప్పలు కొనితెచ్చుకున్నట్టే.