పంచాయతీ ఎన్నికల విషయమై ప్రభుత్వానికి, ఈసీకి రగడ నడుస్తుండగానే సీఎం జగన్ పార్టీ శ్రేణులకు, నాయకులకు అంతర్గతంగా పిలుపునిచ్చారు. ఏ సమయంలో అయినా ఎన్నికల నోటిఫికేషన్ రావొచ్చని, ఎన్నికలు అనివార్యం కావచ్చని, సిద్ధంగా ఉండమని సంకేతాలు పంపారు. ఆయన ఊహించినట్టే సుప్రీం కోర్టు ఆదేశాలతో ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు తీసుకొచ్చేశారు. ఈ పరిణామాన్ని ముందే ఊహించి ఎలాంటి పరిస్థితికి అయినా సిద్ధంగా ఉండాలనే జగన్ నాయకులను హెచ్చరించారు. జగన్ హెచ్చరికలను కొందరు సీరియస్ గా తీసుకోగా ఇంకొందరు లైట్ తీసుకున్నారు. అలా లైట్ తీసుకున్నవారంతా ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
ఈ ఎన్నికల్లో 90 శాతం విజయం వైసీపీ బలపరిచిన అభ్యర్థులే ఉండాలని ఇది ఎన్నికలు పూర్తైన మొదటిసారి ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎంపీలకు ఇస్తున్న మొదటి ఛాలెంజ్ అని చెప్పకనే చెప్పారు. నిజంగానే ఈ ఎన్నికలు పరువుప్రతిష్ఠలకు సంబంధించిన అంశమే. ఎన్నికలను వద్దు వద్దని జగన్ పట్టుబట్టడంతో భయపడుతున్నాడని చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. అయితే ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ప్రత్యర్థులకు బుద్ధిచెప్పాలని, తన బలం చాటాలని జగన్ గట్టిగా డిసైడ్ అయ్యారు.
ముందు ఏకగ్రీవాల మీద దృష్టి పెట్టమని చెప్పారు. జగన్ ఇచ్చిన ముందస్తు సంకేతాలను అందిపుచ్చుకున్న కొన్ని జిల్లాల నేతలు పకడ్బంధీగా ఏర్పాట్లు చేసుకోగా కొన్ని జిల్లాల్లోని నాయకులు మాత్రం లైట్ తీసుకున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్నట్టు బద్ధకం చూపించారు. అదే పెద్ద తప్పిదమైపోయింది. వారి అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్నికలు వచ్చేశాయి. దీంతో హడావుడి సన్నద్ధత మొదలైంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభం ఏమిటి అన్న చందంగా టీడీపీ అప్పటికే పటిష్టమైన ఏర్పాట్లు చేసుకుని ఉండటంతో ఎమ్మెల్యేల పప్పులు ఉడకడంలేదట.
మొదటి దశలో జరిగిన ఏకగ్రీవాలనే పరిశీలిస్తే చిత్తూరు, గుంటూరు మినహా మిగతా జిల్లాల్లో జగన్ ఆశించిన స్థాయిలో లేవనే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి పూర్తి ఆధిక్యం ఇచ్చిన నెల్లూరులోనే తీసుకుంటే 14 మాత్రమే ఏకగ్రీవం కాగా ప్రకాశం జిల్లాలో 28, తూర్పు గోదావరిలో 38, కృష్ణాలో 20, అనంతపురంలో కేవలం 6, శ్రీకాకుళంలో 38 మాత్రమే ఏకగ్రీవమయ్యాయి. దీన్నిబట్టి ఆయా జిల్లాల్లో టీడీపీ పట్టుబిగించిందని అర్థమైపోతుంది. ఇక ఎన్నికల్లో కూడ ఇదే ఎఫెక్ట్ కనబడే ఛాన్స్ ఉంది. టీడీపీ మెజారిటీ సాధించకపోయినా చిత్తుగా ఓడిపోయే పరిస్థితి అయితే ఉండదనే అనిపిస్తోంది. ఒకరకంగా ఇది జగన్ కు మింగుడుపడని విషయమే. మరి దీనికి కారణం నాయకుల అలసత్వమే కదా. అలాంటి నాయకులు జగన్ మార్క్ ట్రీట్మెంట్ నుండి తప్పించుకోలేరు కూడ.