ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. నాటి నుంచి ఏపీలో అక్రమాలు, అరాచకాలు, హత్యలు, దారుణాలు, విధ్వంసాలు చెలరేగిపోతున్నాయంటూ వైసీపీ నేతలు సాక్ష్యాలతో సహా విమర్శలు గుప్పిస్తున్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను, హత్యారాజకీయాలనూ హస్తిన వేదికగా దేశం మొత్తం చుపించారు.
ఆ సంగతి అలా ఉంటే… ఇప్పుడు నియోజకవర్గాల వారీగా ఆయా గ్రామాల్లో ఇసుక దందా, అధికారులపై పెత్తనం, వసూళ్లు మొదలైన కార్యక్రమాలకు పాల్పడుతున్నారని అంటున్నారు. ఇప్పుడు ఈ వ్యవహరం చంద్రబాబు వరకూ చేరిందని తెలుస్తోంది. పైగా ఈ విషయంలో జనసైనికులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా తమ్ముళ్లు చెలరేగిపోతున్నారనేది ఇంటర్నల్ డిస్కషన్.
దీంతో… 2014లో గెలిచిన తర్వాత టీడీపీ కార్యకర్తలు… ఎమ్మెల్యేలకు మించి చేశారనే కామెంట్లు వినిపించాయి. అయితే అప్పట్లో అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత తమ్ముళ్లు రంగంలోకి దిగారు. ఇక జన్మభూమి కమిటీల పేరు చెప్పి చేసిన రచ్చ అంతా ఇంతా కాదనేది తెలిసిన విషయమే. అయితే ఈసారి మాత్రం తమ్ముళ్లు గ్యాప్ తీసుకోలేదని అంటున్నారు. రెండు నెలలకే స్టార్ట్ అని చెబుతున్నారు.
2019 నాటికి కానీ గ్రహించలేదో.. లేదా చంద్రబాబుకి తెలియకుండానే ఈ అరాచకాలు జరిగాయని జనాలు అనుకుంటారని భావించారో కానీ… ఈ విషయం తెలుసుకుని బాధపడుతున్నట్లుగా మాట్లాడారు చంద్రబాబు. జరిగిందేదో జరిగింది నన్ను చూసి ఓట్లు వేయండి అని 2019 ఎన్నికల సమయంలో అడిగారు.. జనం మాత్రం వినిపించుకోలేదు!
అయితే 2014 సీన్ మళ్లీ మొదలైపోయిందనే చర్చ ఇప్పుడు ఏపీలో బలంగా వినిపిస్తుంది. వారిదే రాజ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. అయితే ఈ విమర్శలు ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తే.. ఏదో రాజకీయం అనుకోవచ్చు. కానీ, టీడీపీ అనుకూల మీడియాల్లోనే తమ్ముళ్ల ఆగడాలకు సంబంధించిన వార్తలు వెల్లువెత్తుతున్నాయి.
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఎమ్మెల్యేల పనితీరు.. గందరగోళంగానే కాకుండా.. తమ్ముళ్ల ప్రవర్తన పార్టీకి ఇబ్బందులు సృష్టించేలా మారిపోయిందని చెబుతున్నారు. దీనివల్ల వారు ప్రస్తుతానికి తాత్కాలిక ఆనందం పొందొచ్చు కానీ… ప్రజల దృష్టిలో చూసుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదని చెబుతున్నారు.
ఇప్పుడు దాదాపు ప్రతీ గ్రామంలోనూ పరిస్థితి ఇలానే ఉందనే కామెంట్లు జనసైనికులు కూడా చేస్తున్నారని అంటున్నారు. తమను కూడా తొక్కేస్తున్నారనేది వారి ఆవేదన. తాము ప్రభుత్వంలో ద్వితీయ శ్రేణి పౌరులమనే గుర్తింపు బాధిస్తుందని.. ఇది టీడీపీ ప్రభుత్వం.. అందులో జనసేన ఓ భాగం మాత్రమే అన్నట్లుగా తమ్ముళ్ల తీరు ఉంటుందని చెబుతున్నారు. ఇదేనేమో చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవా అంటే…!!!??