వైసీపీ టార్గెట్ చేసిన తెలుగుదేశం లీడర్లలో అచ్చెన్నాయుడు కూడ ఒకరు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ వైసీపీ మీద, జగన్ మీద ఎడతెగని విమర్శల దాడి చేస్తున్నారు అచ్చెన్న. అందుకే తమ లిస్టులో నెంబర్ 2 స్థానం అచ్చెన్నకు కేటాయించి ఆపరేషన్ షురూ చేశారు జగన్. ఈఎస్ఐ కుంభకోణాన్ని బయటకు తీసి అచ్చెన్నను లోపలికి పంపారు. సుమారు మూడు నెలలపాటు ఆయనకు చుక్కలు చూపించారు. అయినా అచ్చెన్నాయుడు లొంగలేదు. శ్రీకాకుళం జిల్లాలోనే కాదు ఏపీ మొత్తంలో ఆయన పేరు మారుమోగిపోయింది. చంద్రబాబు కూడ అధికార పక్షానికి షాక్ ఇవ్వాలని అచ్చెన్నను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని చేశారు.
అప్పటి నుండి అచ్చెన్న దూకుడు మరింత పెరిగింది. వైసీపీ నేతలు కూడ ఇక మీదట అచ్చెన్నాయుడు మీద ఒక కన్ను వేసే ఉంచాలని డిసైడ్ అయ్యారు. వీలున్న ప్రతి చోటా అచ్చెన్నాయుడును అణచివేయాలని తీర్మానించుకున్నారు. హైకమాండ్ ఈ ధోరణిలో ఉంటే టెక్కలి వైసీపీ నేతలు ఇంకోలా ఉన్నారు. వారంతా కలిసి అచ్చెన్నాయుడుకు సహకరిస్తున్నారు. సహకారం అంటే నేరుగా కాదు.. వర్గపోరుతో. అవును… ప్రస్తుతం టెక్కలి వైసీపీలో వర్గపోరు నడుస్తోంది. టెక్కలి అంటే అచ్చెన్నాయుడుకు కంచుకోట. అక్కడ ఆయన్ను ఓడించడం అంటే దాదాపు అసాధ్యం. గత ఎన్నికల్లో జగన్ తుఫానును తట్టుకున్న 23 నియోజకవర్గాల్లో ఇది కూడ ఒకటి. అక్కడ అచ్చెన్నాయుడుకు పర్మినెంట్ క్యాడర్ ఉంది.
అలాంటి అచ్చెన్నాయుడును ఓడించాలంటే చాలా పకడ్బంధీ ప్లాన్ ఉండాలి. వైసీపీ దగ్గర అది లేదు. ప్రస్తుతం టెక్కలి ఇంఛార్జిగా దువ్వాడ శ్రీనివాస్ వ్యవరిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలో నిలిచి ఓడిన పేరాడ తిలక్ కాళింగ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో ఉన్నారు. గత ఎన్నికలప్పుడే టికెట్ విషయంలో వీరు ఇరువురి నడుమ విబేధాలు చోటుచేసుకున్నాయి. ఆ విబేధాలే ఇప్పటికీ నడుస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఇప్పటి నుండే పోటీపడుతున్నారు. ఒకరి లొసుగుల్ని ఒకరు బయటకు లాక్కుంటున్నారు. వీరి పోరుతో వైసీపీ శ్రేణులు రెండుగా విడిపోయాయి. వీరిద్దరూ చాలరన్నట్టు మధ్యలోకి సీనియర్ నేత కిల్లి కృపారాణి ఎంటరయ్యారు.
జిల్లా ప్రెసిడెంట్ బాధ్యతలు నిర్వహిస్తున్న కృపారాణి పార్టీలో తనకు అన్యాయం జరిగిందని అంటున్నారు. గత ఎన్నికల్లో టికెట్టే కాదు పార్టీలో ఏ కీలక పదవీ ఆమెకు ద్కకలేదు. ఒకప్పుడు కాంగ్రెస్ నుండి పోటీచేసి మేరుపర్వతం లాంటి ఎర్రన్నాయుడును ఓడించిన నన్ను ఇంతలా నిర్లక్ష్యం చేస్తారా అనే ఆవేదన ఆమెలో ఉంది. అందుకే జగన్ ఆమెకు తప్పకుండా న్యాయం చేస్తానని మాటిచ్చారు. ఆ మాట మరేమిటో కాదు రాబోయే ఎన్నికల్లో టికెట్ అని అనుకుంటున్నారు కృపారాణి. ఇలా ఈ ముగ్గురు కీలక నేతల మధ్యన సైలెంట్ వార్ బలంగా నడుస్తోంది. ఫలితంగా పార్టీ జనాల్లోకి వెళ్లలేకుంది. వైసీపీలో ఈ సంక్షోభం అచ్చెన్నకు బాగా కలిసొస్తోంది. క్రియాశీలకంగా ఎదురునిలిచే లీడర్ లేకపోవడంతో ఆయన దూసుకుపోతున్నారు.