ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎజెండాలో భాగంగానే రాజ్యాంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్ జిల్లాల్లో పర్యటిస్తున్నారని.. బాబుకు లబ్ధి చేకూర్చడంలో భాగంగానే అధికారులను భయపెట్టడానికి ఎక్కడిక్కడ బాబు స్క్రిప్ట్ చదువుతున్నారని అంబటి మండిపడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు. ‘రాజకీయాల గురించి, రాజకీయ నేతల గురించి నిమ్మగడ్డ మాట్లాడొచ్చు కానీ.. ఆయన గురించి తాము మాట్లాడకూడదా.. ఇదెక్కడి న్యాయం.. మంత్రులపై కొత్తగా ఆంక్షలు పెట్టారు.. ఎన్నికల కోడ్ మంత్రులు, ఎమ్మెల్యేలకేనా? నిమ్మగడ్డకు వర్తించదా..’ అని అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు.
గతంలో ఎంతోమంది ఎన్నికల అధికారులు, కమిషనర్లను చూశాంగానీ, ఇలాంటి సంకర జాతి కమిషనర్‌ను చూడలేదని విరుచుకుపడ్డారు. నిమ్మగడ్డ పూర్తిగా మతిభ్రమించినట్లుగా మాట్లాడుతున్నారని, ఆయన్ని ఎర్రగడ్డకు పంపాల్సిందేనన్నారు. చంద్రబాబు రుణం తీర్చుకునేందుకే ఆయన దిగజారి వ్యవహరించాలనుకోవడం ప్రజాస్వామ్యంలో దురదృష్ట పరిణామంగా వైఎస్సార్‌సీపీ భావిస్తోందన్నారు. ప్రజలు ఛీకొడుతుంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి వైఎస్సార్‌ను పొగుడుతున్నారని విరుచుకుపడ్డారు. నిమ్మగడ్డ రాజ్యంగ శక్తికాదు.. చంద్రబాబు తొత్తు అని.. వైఎస్సార్‌ను పొగుడుతూనే ఆయన విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారంటూ మండిపడ్డారు. విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పని నిమ్మగడ్డ ప్రజాస్వామ్యవాది ఎలా అవుతారన్నారు. భవిష్యత్తులో దీనికి నిమ్మగడ్డ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.