వైసీపీలో మహిళా ఎమ్మెల్యేల హడావుడి గట్టిగానే కనబడుతోంది. మొటిసారి ఎమ్మెల్యేలు అయిన సదరు మహిళా ఎమ్మెల్యేలు నియోజకవర్గాల మీద పట్టు కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. సొంత పార్టీ నేతలు ఎవరైనా తమ నియోజకవర్గాల్లో కలుగజేసుకుంటుంటే అస్సలు ఊరుకోవట్లేదు. పెత్తనం చేస్తేనే పవర్ ఉంటుందని అనుకున్నారో ఏమో కానీ మంత్రులకు సైతం సమాధానం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మీద తరచూ ఏదో ఒక విమర్శ వస్తూనే ఉంది. శ్రీదేవి తన వద్ద భారీ మొత్తంలో డబ్బు తీసుకుని ఇప్పుడు ఇవ్వనని అడ్డం తిరిగినట్టు మేకల రవి అనే వ్యక్తి ఆరోపణ చేశాడు. ఆ వ్యక్తి కూడ వైసీపీకి చెందిన వ్యక్తే కావడంతో వ్యవహారం పెద్దదైంది.
అంతకుముందు పేకాట క్లబ్ నిర్వహిస్తున్న కొందరు వ్యక్తులు శ్రీదేవి అనుచరులేనని పెద్ద దుమారం లేచింది. దాంతో ఆమె బయటికొచ్చి కన్నీళ్లు పెట్టుకుని మరీ క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అలాగే ఆమె పోలీస్ అధికారితో దురుసుగా మాట్లాడిన ఆడియో టేపులు ఎలా లీకయ్యాయో ఏమో కానీ మరింత కలకలం రేపాయి. ఈ వివాదాలన్నింటికీ కారణం ఎంపీ నందిగం సురేష్ తో ఆమెకు నెలకొన్న వివాదాలేనని టాక్. గుంటూరులో తాడికొండ ప్రభావవంతమైన నియోజకవర్గం. అందుకే నందిగం సురేష్ తన లోక్ సభ పరిధిలో లేకపోయినా కూడ ఆ నియోజకవర్గం వ్యవహారాల్లో కలుగజేసుకుంటున్నారట. అదే శ్రీదేవికి నచ్చలేదు. వివాదం పెద్దదైంది. చివరికి పార్టీ పెద్దలు రంగంలోకి దిగి సర్ది చెప్పాల్సి వచ్చింది.
దాంతో కొన్నాళ్ళు సైలెంట్ అయిన గొడవలు మళ్ళీ మొదలయ్యాయి. పేకాట, అక్రమ మద్యం ఆరోపణల్లో ఉన్న ఇద్దరు పార్టీ నేతలను శ్రీదేవి సస్పెండ్ చేశారు. దీంతో ఆ ఇద్దరూ ఆమె మీద కోపంగా ఉన్నారట. ఎమ్మెల్యే మీద ఏదో ఒక ఆరోపణను లేపుతూ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నారట. ఇతర పార్టీ నేతలు వద్ద ఎమ్మెల్యే అక్రమాలన్నింటినీ బయటపెడతామని పేలుతున్నారట. తమ హెచ్చరికలు ఎమ్మెల్యే వరకు చేరాలనే సహచర నేతల ముందు మాట్లాడుతున్నారట. ఈ తంతు మొత్తాన్ని ఎంపీగారు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని వైసీపీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. మొత్తానికి మొదటిసారి ఎమ్మెల్యే అయిన శ్రీదేవికి పార్టీలోని అంతర్గత కలహాలు పెద్ద తలనోప్పిగా పరిణమించాయి.