వైసీపీ అభ్యర్థుల మార్పు.! దేనికి సంకేతం.?

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్ని మార్చుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండి చెయ్యి చూపక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే, ఇన్‌ఛార్జిల మార్పు అంశం తెరపైకొచ్చింది. నిర్మొహమాటంగా మార్చి పారేస్తున్నారు. ఇంకేముంది.? వైసీపీకి రాజీనామాల పర్వం షురూ అయ్యింది.!

ఆళ్ళ రామకృష్ణారెడ్డి అంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. మంగళగిరి ఎమ్మెల్యే.! ఆర్థికంగా వైసీపీకి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి సేవలు చాలా అవసరం. అలాంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డిని వదులుకోవాల్సి వచ్చినా, వైఎస్ జగన్ వెనుకడుగు వేయలేదు. ఇదీ అధినేత నిబద్ధత.. అన్నది కొందరి వాదన.

కానీ, ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా డెబ్భయ్ నుంచి ఎనభై మంది వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఇది నిజమేనా.? అంటే, నిజమే కావొచ్చు.

వాస్తవానికి ఇది ఇప్పటి మాట కాదు. కొన్నాళ్ళ క్రితం ఐ-ప్యాక్ టీమ్ నిర్వహించిన సర్వే నేపథ్యంలో 60 నుంచి 70 శాతం మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని తేలింది. ఈ విషయాన్ని మాజీ మంత్రి కొడాలి నాని ఓ సందర్భంలో నోరు జారేశారు. ఆ తర్వాత ఆయన తూచ్ అనేశారనుకోండి.. అది వేరే సంగతి.

వైసీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. కానీ, ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదన్నది గ్రౌండ్ లెవల్‌లో బాగా వినిపిస్తోంది. ఎమ్మెల్యేల అవినీతిపై ప్రజల్లో ఫిర్యాదులు ఎక్కువగానే వున్నాయ్. ఈ క్రమంలోనే, అధినేత వైఎస్ జగన్, కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

కానీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైసీపీని వీడితే, ఆ ఇంపాక్ట్ చాలా చాలా గట్టిగా వుంటుందన్నది నిర్వివాదాంశం. ఆళ్ళ రామకృష్ణారెడ్డి దెబ్బతోనే, వైసీపీకి వెన్నులో వణుకు పుట్టిందన్న సంబరాలు విపక్షాల్లో కనిపిస్తుండడం గమనార్హం.