వైసీపీకి గండి పడుతోంది.! ఈ పాపం ఎవరిది.?

‘మా ఓటర్లు వేరే వున్నారు..’ అంటూ కొన్నాళ్ళ క్రితం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే వుంటుంది.

ముందు ముందు, ‘మా అభ్యర్థులు వేరే వున్నారు’ అని అదే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకోవాల్సి వచ్చేలా వుంది.! ‘వై నాట్ 175’ అనే ఆలోచనతో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నియోజకవర్గాల ఇన్‌ఛార్జిల్ని మార్చుతున్న సంగతి తెలిసిందే.

సంక్షేమ పథకాలు అత్యద్భుతంగా అమలు చేస్తున్నాం, రాష్ట్రంలో ప్రతి కుటుంబమూ లబ్ది పొందుతోంది.. సో, మళ్ళీ మనమే గెలుస్తాం.. అని వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావించడం తప్పు కాదు.

కానీ, రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయ్. ‘ఎవరొచ్చినా సంక్షేమ పథకాలు అమలు చేసి తీరాలి’ అనే ఆలోచనతో వుంటుంటారు జనం. ఆ లెక్కన, అమలవుతున్న సంక్షేమ పథకాలు, అధికారంలో వున్న పార్టీల్ని మళ్ళీ గెలిపించకపోవచ్చు.

ఆ సంగతి పక్కన పెడితే, సిట్టింగుల్ని కాదని, వేరే అభ్యర్థుల్ని రంగంలోకి దించడంతో, సిట్టింగులు అసహనానికి గురవుతున్నారు. పైకి సిట్టింగులు ఏం చెబుతున్నా, తెరవెనుకాల వాళ్ళు ఏం చేయాలో అదే చేస్తారు. ఆ విషయం వైఎస్ జగన్‌కి ముందు ముందు అర్థమవుతుంది.

ఇన్‌ఛార్జిల మార్పు విషయమై ముఖ్యమంత్రి స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వైసీపీలో ఎవరన్నా చెబితే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆఫ్ ది రికార్డుగా వైసీపీలోనే కొందరు నేతలు చర్చించుకుంటున్నారు.

శకునిలా మారి, వైసీపీని ముంచేస్తున్నారు.. ముఖ్యమంత్రి కష్టాన్ని వృధా చేస్తున్నారన్న చర్చ చాలా చాలా గట్టిగా జరుగుతోంది. ఎవరా శకుని.? ఏమా కథ.?