సంక్షేమ పథకాలు ఓట్లు రాల్చవా.? వైసీపీలో టెన్షన్ టెన్షన్.!

‘ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తున్నావ్ డబ్బులు.? మీ ఇంట్లోంచి తెచ్చి ఇస్తున్నావా.? మా తల తాకట్టు పెట్టి కదా, అప్పులు తెస్తున్నావ్.. వాటి పేరుతో నువ్వు పబ్లిసిటీ స్టంట్లు చేసుకుంటున్నావ్..’ అంటూ నిలదీతలు ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీకి ఎదురవుతున్నాయి.

నిజానికి, ఇందులో వాస్తవం వుంది.! ఏ ప్రభుత్వమైనా సంక్షేమ పథకాలు అమలు చేయడమంటే, అదేమీ ఆయా ప్రభుత్వాలను నడుపుతున్న పార్టీలు, అందులోని వ్యక్తుల వ్యక్తిగత సొమ్ములతో చేసేది కాదు. ప్రభుత్వాలు చేసే అభివృద్ధి కార్యక్రమాలైనా అంతే.! ఇక, జనం సొమ్ముతో రాజకీయ నాయకులు సొంత పబ్లిసిటీ స్టంట్లు చేయడమూ కొత్త కాదు. చంద్రబాబు హయాంలోనూ, అంతకు ముందూ.. అదే జరిగింది.

ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలోనూ అదే జరుగుతోంది. ఇంటింటికీ స్టిక్కర్లు అయినా.. సర్టిఫికెట్లపైన వైఎస్ జగన్ ఫొటోలు అయినా.. చివరికి భూముల హద్దులను పేర్కొనే హద్దురాళ్ళపై జగన్ పేర్లు అయినా.. ఇవన్నీ జస్ట్ పొలిటికల్ స్టంట్లు మాత్రమే. జనం నిలదీయడం ఎక్కువైందంటే, అధికార పార్టీ అప్రమత్తంగా వుండాల్సిందే.

కానీ, నిలదీస్తున్నవారిపై అధికార పార్టీ నేతలు గుస్సా అవుతున్నారు. ‘ముక్కు పిండి మరీ మీకిచ్చిన సంక్షేమ పథకాల తాలూకు సొమ్ముని వెనక్కి లాగేస్తాం’ అంటున్నారు కొందరు వైసీపీ నేతలు. ఈ చర్యల వల్ల వైసీపీ సంక్షేమ ఓటు బ్యాంకు దెబ్బతినే ప్రమాదం వుంది.!