గెలిపించింది ఐ-ప్యాక్.! ఓడించేదీ అదేనా.?

రాజకీయ పార్టీల్లోనే వ్యూహకర్తలుంటారు. పైగా, అధికారంలో వున్న పార్టీకి ప్రజాధనంతో గౌరవ వేతనాలు పొందే సలహాదారులు కూడా వుంటారు. అలాంటప్పుడు, కొత్తగా ప్రైవేటు రాజకీయ వ్యూహకర్తలతో పనేంటి.?

2019 ఎన్నికల్లో వైసీపి గెలుపుకి దోహదపడ్డ చాలా అంశాల్లో ఐ-ప్యాక్ కూడా ఒకటి. ఐ-ప్యాక్ వ్యూహాల్ని సమర్థవంతంగా వైసీపీ అమలు చేయగలిగింది, విజయం సాధించగలిగింది. అధికారంలోకి వచ్చాక కూడా ఆ ఐ-ప్యాక్ మీదనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆధారపడుతున్నారన్న విమర్శలు లేకపోలేదు.

ఈ విమర్శలేవో వైసీపీ రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్నవి కావు. సొంత పార్టీలోనే పైకి చెప్పుకోలేక, ఆఫ్ ది రికార్డుగా మీడియాకి లీకులు ఇస్తున్న బాపతు.! వైసీపీ అనుకూల మీడియా కూడా ఈ విషయమై అధినాయకత్వాన్ని అడపా దడపా తప్పు పడుతూనే వుంది.

ఎందుకిలా.? 2024 ఎన్నికలకు సంబంధించి ఐ-ప్యాక్ అవసరం వైసీపీకి ఎంత మేర వుంది.? టిక్కెట్టు కోసం అధినాయకత్వం మెప్పు పొందాల్సిన వైసీపీ నేతలు, ఐ-ప్యాక్ టీమ్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు.? తమకు అనుకూలమైన సర్వే రిపోర్టులు తెప్పించుకునేందుకు వైసీపీ నేతలు ఎందుకు నానా తంటాలూ పడాల్సి వస్తోంది.?

ఈ విషయమై వైసీపీలో ముసలం ఒకింత ఇబ్బందికరంగానే మారుతోందన్నది నిర్వివాదాంశం. కానీ, పైకి ఎవరూ ఈ విషయమై గట్టిగా నోరు పెగల్చలేని పరిస్థితి. 2024 ఎన్నికల్లో వైసీపీ గనుక ఓడిపోతే, అందులో ఐ-ప్యాక్ పాపం కూడా ఖచ్చితంగా వుంటుంది. కాదు కాదు వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్వయంకృతాపరాధమే అవుతుంది. ఇదీ వైసీపీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ.