రోజులు మారిపోయాయి.. జనం మారిపోయారు.. రాజకీయాలూ మారిపోయాయి! ఒకప్పుడు ప్రచారాలు, ప్రసంగాలు వేరు.. నేటి రోజుల్లో పూర్తిగా వేరు! అప్పట్లో ఏదైనా ఒక ప్రకటన చేస్తే… అర్ధరాత్రి మిషన్ సెక్షన్ లో న్యూస్ ప్రింట్ ప్లేట్స్ ఎక్కేవరకూ మార్చుకునే ఛాన్స్ ఉండేది! అయితే ఇప్పుడు అలా కాదు. ఒక్క అసత్య ఆరోపణ చేసినా.. ప్రత్యర్థులు చూపించిందే చూపిస్తూ ఆడేసుకుంటారు. ఫలితంగా ప్రజల్లో చులకన చేసేస్తుంటారు. ప్రస్తుతం పవన్ కు ఈ పరిస్థితి తెచ్చే ప్రయత్నంలో ఉంది వైసీపీ.
వారాహి యాత్రలో భాగంగా తొలిరోజు సభలో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్… గడిచిన ఎన్నికల టాపిక్ ఎత్తారు. 2019 ఎన్నికల్లో అటు గాజువాకలోనూ, ఇటు భీమవరంలోనూ తాను ఓడించారంటూ ఇంతకాలం ఆవేదన వ్యక్తం చేస్తూ.. గెలిపించి ఉంటే గట్టిగా నిలబడేవాడిని అని చెప్పుకునే వారు. అయితే తాజా ప్రసంగంలో… భీమవరంలో ఉన్న ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు వేయించారంటూ ఆరోపించారు.. తనపై కుట్ర చేశారని అంటునారు!
దీంతో మైకులకు పనిచెప్పారు వైసీపీ నేతలు. డేటా మొత్తం మీడియా ముందు పెట్టి పవన్ ను వాయించే పనికి పూనుకున్నారు. అసత్య ఆరోపణలతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారంటూ పవన్ ని దుబ్బయబడుతున్నారు.
వివరాళ్లోకి వెళ్తే… గాజువాకలో 2019 ఎన్నికల నాటికి మొత్తం 3,09,326 ఓట్లు ఉండగా.. పోలైన ఓట్లు (నోటా కాకుండా) మాత్రం 1,85,394. మొత్తం పోలింగ్ సుమారు 60 శాతం. ఇంకా ఓటు వేయని వారి సంఖ్య 40% పైనే. ఇందులో వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డికి 74,645 ఓట్లు పోలవ్వగా.. పవన్ కు 56,125 ఓట్లు పోలయ్యాయి. ఇక టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస రావుకు 54, 624 ఓట్లు వచ్చాయి.
ఇక భీమవరం నియోజకవర్గం విషయానికొస్తే… భీమవరంలో మొత్తం 2,46,424 ఓట్లు ఉండగా.. పోలైన ఓట్లు 192,061. పోలింగ్ శాతం 77.94%. అంటే… ఇంకా ఓటు వేయని వారు సుమారు 50వేల మందికి పైగానే ఉన్నారన్న మాట. ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీను కి 70,642 ఓట్లు పోలవ్వగా.. పవన్ కు 62,285 ఓట్లు.. టీడీపీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులికి 54,037 ఓట్లు వచ్చాయి.
ఇలా గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో ఓటు హక్కు ఉండీ ఓటేయని వారు భారీగా ఉంటే.. పవన్ కల్యాణ్ మాత్రం ఉన్న ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు వేశారని, ఫలితంగా తనపై కుట్ర చేశారని చెబుతున్నారు! దీంతో… డేటా ఇంత క్లియర్ గా ఉంది.. లెక్కలు ఇంత వివరంగా ఉంటే… పవన్ పచ్చి అబద్ధాలు ఆడుకుంటూ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబడుతున్నారు వైసీపీ నేతలు. ఇకనుంచైనా రాసిచ్చింది రాసిచ్చినట్లు చదవకుండా.. కాస్త క్రాస్ చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.