ఈ భవనం ఎవరిదో చెప్పుకోండి చూద్దాం

అవును చడీ చప్పుడు లేకుండా, ఎటువంటి ప్రచారం లేకుండానే విశాలమైన భవనం పూర్తయిపోతోంది. ఇంతకీ ఈ భవనం ఎవరదనే కదా మీ సందేహం. రాజధాని అమరావతి పరిధిలోని తాడికొండలో జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. రెండస్తుల భవనంలో ఒక అంతస్తులో పార్టీ ఏపి కార్యాలయం, రెండో అంతస్తులో జగన్ నివాసం ఉంటాయి. శరవేగంగా పనులు జరుగుతున్న ఈ భవనాన్ని వచ్చే ఫిబ్రవరి 14వ తేదీలోగా పూర్తి చేయనున్నారు. ఎందుకంటే, 14వ తేదీన భవనాన్ని ప్రారంభించాలని జగన్ నిర్ణయించుకున్నారు. అంటే 14వ తేదీ గృహప్రవేశానికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు.

ఫిబ్రవరి 14వ తేదీకి మరో విశేషం కూడా ఉంటుంది. అదేమిటంటే, గృహప్రవేశ కార్యక్రమానికి కెసియార్ ను జగన్ ఆహ్వానించారు. ఫెడరల్ ఫ్రంట్ లో జగన్ చేరాలంటూ మొన్ననే కెసియార్ కొడుకు, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటియార్ అండ్ కో జగన్ తో భేటీ జరిగింది గుర్తుంది కదా ? అదే సమయంలో కెటియార్ మాట్లాడుతూ తొందరలోనే కెసియార్ విజయవాడకు వెళ్ళి జగన్ తో భేటీ అవుతారని చెప్పారు. అంటే కెటియార్ చెప్పినదాని ప్రకారం జగన్ నిర్మిస్తున్న భవనం గృహప్రవేశానికే కెసియార్ హాజరవుతున్నారట.

ఇక అధికార, ప్రతిపక్షాల విమర్శలకు కూడా చెక్ పెట్టాలంటే పార్టీ ఏపీ కార్యాలయం విజయవాడలోనే ఉండాలని జగన్ అనుకున్నారు. అందుకనే తాడికొండలో రెండెకరాల భూమిని వైసిపి కొనుగోలు చేసింది. ప్రస్తుతం వైసిపి కీలక సమావేశాలైనా, మీడియా సమావేశాలైనా ప్రస్తుతం హైదరాబాద్ లోని లోటస్ పాండులోని కేంద్ర కార్యాలయంలోనే జరుగుతున్నాయి. అందుకే టిడిపి ప్రతీసారీ జగన్ ను విమర్శిస్తోంది.  ఇఫ్పటికే గుంటూరులో టిడిపి రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించుకున్నది. జనసేన ఏపి కార్యాలయం కూడా ఈమధ్యనే విజయవాడలో నిర్మించుకున్నారు. వామపక్షాలు, కాంగ్రెస్ కు కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయి. అందుకే జగన్ కు కూడా కార్యాలయం ఏర్పాటు తప్పలేదు.