దీపావళి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి సంచలన ట్వీట్ చేశారు. లండన్ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే జగన్.. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.
“మీరూ, మీ కూటమి ఇంటింటా వెలిగిస్తాం అన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా, మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా? ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా?” అని జగన్ ట్వీట్‌లో నిలదీశారు.

అమలు కాని హామీలపై ప్రశ్నల వర్షం:
నిరుద్యోగులందరికీ నెలకు రూ. 3 వేల భృతి.
ప్రతి అక్కా చెల్లెమ్మకూ నెల నెలా రూ. 1500, సంవత్సరానికి రూ. 18,000.
50 ఏళ్లకే పెన్షన్, నెల నెలా రూ. 4 వేలు.
ప్రతి రైతుకూ పీఎం కిసాన్ కాకుండా ఏటా రూ. 20,000 అదనంగా.
ఎంతమంది పిల్లలు ఉన్నా, ఆ పిల్లలందరికీ, ప్రతి ఒక్కరికీ ఏటా రూ. 15,000.
ప్రతి ఇంటికీ ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఈ రెండేళ్లలో 6 సిలిండర్లు.
అక్క చెల్లెమ్మలందరికీ ఏ బస్సులో అయినా ఉచిత ప్రయాణం.
ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు.

ఈ హామీల అమలుపై స్పందిస్తూ.. “ఇవన్నీ వెలగని దీపాలో…లేక చేశాం అంటే చేశాం అన్నట్టుగా వెలిగించిన అరకొర దీపాలా..? లేక మీరు రాకముందు వరకూ దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలను ఆర్పడమా?” అని ప్రశ్నల వర్షం కురిపించారు.
స్కూళ్లు, ఆస్పత్రులు, విద్యా, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్, పారదర్శకత కూడా వెలగని దీపాలేనని జగన్ అభిప్రాయపడ్డారు.
తన ట్వీట్‌ను ముగిస్తూ, జగన్ తన గత పాలనను ప్రస్తావించారు. “మా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 2019-24 మధ్య… ఇంటింటికీ అందిన డీబీటీ అనే ఇంధనం ద్వారా దేదీప్యమానంగా వెలిగిన దాదాపు 30 పథకాలు అనే దీపాలను మొత్తం ఆర్పేసిన మీరు, ఇంటింటా నెలకొన్న చీకటికి ప్రతినిధులు” అని చంద్రబాబును ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలతో ముగించారు.
దీపావళి పండుగ వేళ, జగన్ చేసిన ఈ ట్వీట్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షం లేవనెత్తిన ఈ ప్రశ్నలకు అధికార కూటమి ఎలా స్పందిస్తుందో చూడాలి.

