ఢిల్లీకి చేరుకున్న వైఎస్ జ‌గ‌న్‌

ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆదివారం రాత్రి దేశ రాజ‌ధాని న్యూఢిల్లీకి చేరుకున్నారు. సాధార‌ణ పౌర విమానంలో శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం నుంచి బ‌య‌లుదేరిన ఆయ‌న రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో ఢిల్లీ విమానాశ్ర‌యంలో దిగారు.

రాష్ట్రంలో ఓట‌ర్ల జాబితాలో చోటు చేసుకున్న అవ‌క‌త‌వ‌క‌లపై సోమ‌వారం ఉద‌యం కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ సునీల్ అరోరాను క‌లుసుకోనున్నారు. డీజీపీ వ్య‌వ‌హార శైలిని కూడా జ‌గ‌న్ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ దృష్టికి తీసుకెళ్లే అవ‌కాశాలు ఉన్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి ప‌రుల ఓట్ల‌ను జాబితా నుంచి తొల‌గించిన‌ట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న విష‌యం తెలిసిందే.

స‌ర్వేల పేరుతో కొన్ని సంస్థ‌ల ప్ర‌తినిధులు లాప్‌టాప్‌, ట్యాబ్‌ల ద్వారా గ్రామాల‌కు వెళ్లి వైఎస్ఆర్ సీపీ సానుభూతి ప‌రుల ఓట్ల‌ను తొల‌గించార‌నే ఆరోప‌ణ‌లు కొంత‌కాలంగా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేశాయి.

ఈ సారి ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి ఓటు వేస్తారు? అని ప్ర‌శ్నించడం, వైఎస్ఆర్ సీపీకి ఓటు వేస్తామ‌ని ప్ర‌జ‌లు బ‌దులు ఇస్తే.. వారి ఓట‌ర్ ఐడీ నంబ‌ర్‌ను తీసుకోవ‌డం, అనంత‌రం జాబితా నుంచి ఆ పేరును తొల‌గించ‌డం వంటి ప‌నులు చోటు చేసుకుంటున్నాయ‌ని చెబుతున్నారు. దీనిపై జ‌గ‌న్ రంగంలోకి దిగారు.

ఈ విష‌యాన్ని ఆయ‌న కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ దృష్టికి తీసుకెళ్ల‌నున్నారు. ఉద‌యం 11:30 గంట‌ల‌కు నిర్వాచ‌న్ స‌ద‌న్‌లో జ‌గ‌న్‌.. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌తో భేటీ అవుతారు. కొన్ని ప‌క్కా ఆధారాల‌ను కూడా జ‌గ‌న్ త‌న వెంట తీసుకెళ్ల‌నున్నారు.

జ‌గ‌న్‌కు అధిక సీట్లు వ‌చ్చే అంచ‌నాలు ఉన్న జిల్లాలు, నియోజ‌క‌వ‌ర్గాల్లో మండ‌ల స్థాయిలో ఓట‌ర్ల పేర్ల‌ను తొల‌గించార‌ని వైఎస్ఆర్ సీపీ నాయ‌కులు చెబుతున్నారు. ఒక్కో జిల్లాలో, ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో వేల సంఖ్య‌లో ఓట‌ర్ల‌ను తొల‌గించిన‌ట్లు త‌మ వ‌ద్ద ఆధారాలు ఉన్నాయ‌ని అంటున్నారు.

వాట‌న్నింటినీ తాము కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌కు స‌మ‌ర్పిస్తామ‌ని చెప్పారు. ఈ సారి ఓటమి త‌ప్ప‌ద‌ని భావిస్తోన్న అధికార తెలుగుదేశం పార్టీ.. త‌మ పార్టీ సానుభూతి పరుల ఓట్ల‌ను జాబితా నుంచి తొల‌గిస్తోంద‌ని వైఎస్ఆర్ సీపీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు.