వైసీపీ బస్సు బయల్దేరుతోంది.. అసలు స్కెచ్ ఇదే!

గతంతో పోలిస్తే విపక్షాలు మరింత బలహీనంగా ఉన్నాయి.. వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం ఆల్ మోస్ట్ కన్ ఫాం అని సర్వేలన్నీ చెబుతున్నాయి! అయినా కూడా జగన్ ఏమాత్రం అలసత్వం వహించడం లేదు. చిన్నపామునైనా, ముసలి పామునైనా పెద్దకర్రతోనూ, బలమైన కర్రతోనే కొట్టాలని ఫిక్సయినట్లున్నారు. ఈ క్రమంలో తాజాగా బస్సుయాత్రకు ముహూర్తం ఫిక్స్ చేశారు.

వాస్తవానికి వైసీపీ కంటే ముందు టీడీపీ బస్సు యాత్ర ప్రారంభించింది. మినీ మ్యానిఫెస్టో ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టాలని ఫిక్సయ్యింది. కొన్ని రోజులు జరిగింది కూడా. అయితే అనుకున్న స్థాయిలో ఆదరణ దక్కలేదనే కామెంట్లు వినిపించాయి. చంద్రబాబు జైలులో ఉండకపోతే ఈపాటికే ఆ బస్సుయాత్రను పూర్తి చేసి ఉండేవారు. బాబు అరెస్ట్ తర్వాత టీడీపీ నేతలు కనీసం బస్సు యాత్ర కూడా చేయలేకపోతున్నారా అనే కామెంట్లు వినిపించాయి.

దీంతో… ఆయన అరెస్ట్ నేపధ్యంలో అక్టోబర్ మొదటి వారంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి బస్సు యాత్ర చేపడతారు అని ప్రచారం సాగింది. కానీ ఆ కార్యక్రమం వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. ప్రతీ శనివారం కంచాలు మోగిద్దాం, విద్యుత్ దీపాలు ఆర్పేద్దాం వంటి కార్యక్రమాలకే పరిమితమైనట్లు తెలుస్తుంది. పోనీ లోకేష్ యువగళం అయినా కంటిన్యూ అవుతుందేమో, కేడర్ లో ఎంతోకొంత కదలిక ఉంటుందేమో అనుకుంటే… ఆయన హస్తినకే పరిమితమైన పరిస్థితి!

ఈ నేపథ్యంలో… వైసీపీ ఒక్క సారిగా స్పీడ్ పెంచేసింది. జగన్ ఈ నెల 9న విజయవాడలో పార్టీ ప్రతినిధులతో సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తర్వాత మరింత జోరు పెంచారు. పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లతో జగన్ మరో మీటింగ్ నిర్వహించారు. పార్టీ ప్రతినిధుల సభలో చెప్పిన విషయాలు అన్నీ సవ్యంగా గ్రౌండ్ లెవెల్ లో సాగేలా చూడాలని జగన్ ఆదేశించారు.

ఇందులో భాగంగా… ఇక ఈ నెల 26 నుంచి వైసీపీ బస్సు యాత్ర స్టార్ట్ అవుతుంది అని జగన్ ప్రకటించారు. ఈ బస్సు యాత్రకు “సామాజిక బస్సు యాత్ర” అని పేరు పెట్టారు. ఈ బస్సు యాత్ర ప్రతీ నియోజకవర్గంలో మీటింగ్ కచ్చితంగా ఉండేలా సాగుతుంది. అదేవిధంగా… మూడు ప్రాంతాలను కవర్ చేస్తూ డైలీ కనీసం మూడు మీటింగ్స్ తక్కువ కాకుండా రెండు నెలలలో ఈ బస్సు యాత్ర పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు.

ఈ బస్సు యాత్ర సక్రమంగా సాగేలా చూడాల్సిన బాధ్యతను రీజనల్ కోర్ ఆర్డినేటర్లతో పాటు సీనియర్ నేతలను బాధ్యులుగా నియమించారు. ఇక బస్సు యాత్ర సాగే ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేదా ఇంచార్జితో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బీసీ సామాజికవర్గాలకు చెందిన నాయకులు అంతా వేదిక మీదకు వచ్చి ప్రసంగించాలని జగన్ సూచించారు.

ఇందులో భాగంగా… ముఖ్యంగా గడచిన 52 నెలలలో వైసీపీ ప్రభుత్వం ఎవరెవరికి ఏమేమి చేసింది అన్నది ప్రజలకు సవివరంగా తెలియచేయాలని జగన్ సూచించారు. ఏపీలో ఉన్న ప్రతీ పేదవాడూ వైసీపీని తమ సొంత పార్టీగా చూడాలని ఆ విధంగా వారంతా ఓన్ చేసుకునేలా వారి వద్దకు చేరి వివరించాలని జగన్ స్పష్టం చేశారు. ఫలితంగా… వైనాట్ – 175 లక్ష్యాన్ని చేరుకోవచ్చని జగన్ బలంగా విశ్వసిస్తున్నారని అంటున్నారు.