ఏపీలో పంచాయతీ ఎన్నికలలో వచ్చిన ఫలితాలను బట్టి చూస్తుంటే వైసీపీకి గ్రామస్థాయిలో బలం అలాగే ఉంది అని చెప్పాలి. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 90 శాతం పంచాయతీలను వైసీపీ మద్దతు దారులు గెలుచుకున్నారు. జగన్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు కావస్తుంది. ఇరవై నెలల్లో అసంతృప్తి పెరిగిందని విపక్షాలు అంచనా వేశాయి. అయితే పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలను చూస్తే అది నిజం కాదు అని తెలిసిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికలలోనూ గ్రామీణ ప్రాంతాలే వైసీపీని అధికారంలోకి తేగలగాయి.
పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు కొంత మిశ్రమంగా స్పందించినప్పటికీ గ్రామీణ స్థాయి ఓటర్లు మాత్రం ఫ్యాన్ పార్టీ వైపు అప్పట్లో మొగ్గు చూపారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సంక్షేమ పథకాలపైనే దృష్టి పెట్టారు. దాదాపు 67 వేల కోట్లకుపైగానే సంక్షేమ పథకాలను ప్రజలకు పంచారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పట్టు పెంచుకోవడం కోసం పాదయాత్రలోనూ, మ్యానిఫేస్టోలోనూ చెప్పిన అంశాలలో 90 శాతం అమలు చేసేందుకు జగన్ ప్రయత్నించారు.
వైసీపీ నుంచి పోటీ ఎక్కువగా ఉండటంతో అనేక చోట్ల వైసీపీలోనే రెండు గ్రూపులు పోటీకి తలపడ్డాయి. లేకుంటే మరిన్ని పంచాయతీలు కైవసం చేసుకోగలిగేవారమని వైసీపీ నేతలు చెబుతున్నారు.ఇక సంక్షేమ పథకాలకు వరసగా వ్యవస్థల ద్వారా చంద్రబాబు జగన్ ను అడ్డుకోవడం కూడా వైసీపీకి కలసి వచ్చిందంటున్నారు. సానుభూతి పెరగడంతోనే వైసీపీకి వన్ సైడ్ గా ఓట్లు వేశారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. పంచాయతీ ఎన్నికల తొలి దశ ఎన్నికల్లో వైసీపీ ఊహించిన దానికన్నా పాజిటివ్ ఫలితాలు రావడంతో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం పెల్లుబుకుతోంది