టీడీపీ చేసిన తప్పిదాన్నే వైసీపీ కూడా రిపీట్ చేస్తోన్నట్టే.!

YSRCP

రాజకీయ పార్టీలకు సంబంధించి మీడియాలో ఊహాగానాలు రావడం మామూలే. ఆయా పార్టీల నుంచి లీకులు మీడియాకి అందడం కొత్తేమీ కాదు. కాకపోతే, చంద్రబాబు హయాంలో టీడీపీ అనుకూల మీడియా కొన్ని ఊహాజనిత కథనాల్ని తెరపైకి తెచ్చి, తెలుగుదేశం పార్టీని ముంచేసిన సంగతి తెలిసిందే. టీడీపీకి మేలు చేసే ప్రయత్నంలో, టీడీపీ నాశనమవడానికి కారణమయ్యింది టీడీపీ అను’కుల’ మీడియా.!

ఇప్పుడు అదే తప్పు, వైసీపీ విషయంలోనూ జరుగుతోందా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోంది. టీడీపీకి ఎలాగైతే అను’కుల’ మీడియా వుందో, అంతకు మించిన రీతిలో వైసీపీకి కూడా అను’కుల’ మీడియా తయారైంది. కులభావనని తప్పు పట్టలేం. కానీ, అత్యుత్సాహంతో కులభావాన్ని ఇతరుల మీద రుద్దేయడమే తప్పు.!

వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి టిక్కెట్లు దక్కని నేతలెవరన్నదానిపై ఇటీవలి కాలంలో మీడియాలో, అందునా వైసీపీ అనుకూల మీడియాలో బోల్డన్ని గుసగుసలు, విశ్లేషణాత్మక కథనాలూ దర్శనమిస్తున్నాయి. వాటిల్లో చాలావరకు పెయిడ్ ఆర్టికల్స్ అనే ప్రచారం జరుగుతోంది.

వైసీపీలోనే, సిట్టింగ్ ఎమ్మెల్యేలంటే గిట్టని నాయకులు ఈ తరహా రాతల్ని వైసీపీ అనుకూల మీడియా ద్వారా ప్రచారంలోకి తెస్తున్నారట. ఈ విషయమై అధినాయకత్వానికి ఇటీవల ఓ నివేది కూడా అందినట్లు ప్రచారం జరుగుతోంది. ఫలానా ఎమ్మెల్యే ఈసారి టిక్కెట్ మర్చిపోవచ్చు.. ఫలానా నాయకుడు వైసీపీలో వుండడం వేస్ట్.. అంటూ ఆయా కథనాలు దర్శనమిస్తున్నాయి వైసీపీ అనుకూల మీడియాలో.

దాంతో, ఆయా నేతలు అధినేత వద్ద ఆయా మీడియా సంస్థల తీరుపై ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తరహా వైఖరిని వైసీపీ అధినాయకత్వం ప్రోత్సహిస్తే.. టీడీపీ మునిగినదానికంటే ఘోరంగా వైసీపీ కూడా మునిగిపోయే ప్రమాదం వుంది.