వైసీపీ, టీడీపీల నడుమ అమరావతి యుద్ధం భీకరంగా మారిన సంగతి తెలిసిందే. చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా అమరావతిని కావాలనే నిర్వీర్యం చేసున్నారని మండిపడుతున్నారు. న్యాయపోరాటం, ఉద్యమం అంటూ పైస్థాయి మాటలే మాట్లాడుతున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం అమరావతిని పూచికపుల్లతో సమానంగా చూస్తున్నారు. అసలు అక్కడ అమరావతి అనే విషయాన్ని మర్చిపోండి అంటున్నారు. ఏ ఒక్కరూ అమరావతి మీద సానుకూల స్పందన ఇవ్వట్లేదు. పైపెచ్చు అది భ్రమరావతి అని, అక్కడేముంది ఎడారే కదా, ఉద్యమ చేసున్నవారంతా పెయిడ్ ఆర్టిస్టులే అని చులకనగా మాట్లాడారు. ఇటీవల అమరావతి రైతుల ఉద్యమం 300రోజులకి చేరితో ఫ్లాప్ సినిమాకు శతదినోత్సవాలా అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.
ఇలా అమరావతి విషయంలో పూర్తి క్లారిటీతో ఉన్న వైసీపీ నేతలు ఈమధ్య అమరావతి రైతులకు ఫోన్లు చేసి మన్నించమని అడిగినట్టు ప్రచారం జరుగుతోంది. ఉదయమం చేస్తున్న రైతులను, మహిళలను తమ పార్టీ నేతలు కించరిచేలా మాట్లాడారని, అందుకుగాను తాము క్షమాపణలు చెప్పుకుంటున్నామని, తాము అమరావతిలోని రాజధాని ఉండాలని గట్టిగా కోరుకుంటున్నామని, మీకు మద్దతిస్తామని మాట్లాడుతున్నారట. ఇన్నాళ్లు అవమానాలు చేసిన పార్టీ నేతలు ఇప్పుడు ఫోన్లు చేసి పరామర్శలు, క్షమాపణలు చెబుతూ భరోసా ఇస్తుండటంతో ఖంగుతినడం రైతుల వంతైందట. ఈ ఫోన్ల మీద పరామర్శల అంశాన్ని టీడీపీ సోషల్ మీడియా గట్టిగా ప్రచారం చేస్తోంది.
అసలు వైసీపీలోనే అమరావతికి అనుకొలవర్గం ఒకటి తయారైందనే ప్రచారం జరుగుతోంది. కానీ వైసీపీ అభిమానులు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. వైసీపీ నేతలెవరూ అమరావతి విషయంలో మాటను వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదని మూడు రాజధానులు అనేది జగన్ నిర్ణయమని, అది జరిగి తీరుతుందని, దానికి వ్యతిరేకంగా పార్టీలో నాయకులెవరూ రైతులకు ఫోన్లు చేసి మద్దతివ్వడం జరగలేదని, జరగదని అంటున్నారు. ఒకవేళ రైతులకు ఫోన్లు వెళ్లడమే నిజమైతే అవి వైసీపీ నేతల పేర్లతో టీడీపీ నాయకులు చేసిన ఫోన్ కాల్స్ అయ్యుంటాయని బల్లగుద్ది చెబుతున్నారు.