తారలు దిగివస్తున్న వేళ… ఆంధ్రలో వైసిపి యే ‘స్టార్ ఎట్రాక్షన్’

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలుపు తనదేనన్న ధీమాతో వైఎస్ ఆర్ కాంగ్రెస్ దూసుకుపోతున్నది. ఈ పార్టీ నేత చేస్తున్న యాత్రలకు, ప్రచారానికి జనం విరగబడి వస్తుండటం, దానికితోడు నేషనల్ చానెళ్ల సర్వేలు లోక్ సభ ఎన్నికల్లో వైసిపికి నమ్మలేనంతగా 22 సీట్ల గెలుపు ఇస్తుండటంతో వైసిపిలో ఉత్సాహానికి అవధుల్లేకుండా పోయింది. దీనితో వైసిపిలోకి రాజకీయ నాయకులు పరుగులుపెడుతున్నారు. ఇదొక ఎత్తయితే, పార్టీలోకి సినీ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున వచ్చి చేరుతున్నారు. దీనితో ఈ ఎన్నికల్లో వైఎస్ ఆర్ సి స్టార్ ఎట్రాక్షన్ అయింది.

జగన్ కు మద్దతుగా సినీనటులు క్యూ కడుతున్నారు. హాస్యనటులు పోసాని, అలీ, పృథ్వీ పార్టీకి అండగా నిలిచారు. ఎమ్మెల్యే రోజా సరే సరి. ఆమె వైసిపి తరఫున గెల్చి ఒక టర్మ్ పూర్తి చేయడమే కాదు, వైసీపీలో స్టార్ పర్ ఫార్మర్ అయ్యారు. ఎన్నికల ప్రచారకార్యక్రమాలలోనే కాదు, ఎక్కడ సమావేశం జరిగినా ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.ఆమె మోస్టు సక్సెస్ ఫుల్ వుమన్ లెజస్లేటర్ అనక తప్పదు.

నిజానికి, ఈ సారి ఆంధ్రప్రదేశ్ లో సినిమా నటుల సందడి గతం కంటే మరింత ఎక్కువయ్యిందనాలి. సాధారణంగా సినిమావాళ్లకు రూలింగ్ పార్టీ మీద మోజెక్కువగా ఉంటుంది. అయితే, ఆంధ్రలో వ్యవహారం తలకిందులయింది. ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి అండగా తెలుగు సినీరంగ ప్రముఖులు, ముఖ్యంగా హాస్యనటుల చేరిక జోరుగా సాగుతున్నది. వైసీపీ నుంచి చిత్తూరు జిల్లా నగరి నుంచి సినీ నటి రోజా రెండో సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. గెలుపుతనదేనన్న ధీమాతో రోజా ఉన్నారు.

వైసిపికి స్టార్ ఎట్రాక్షన్ పెరుగుతూ ఉంది. మాజీ ఎమ్మెల్యే జయసుధ ఈ మధ్య పార్టీలో చేరారు. హాస్యనటులు పోసాని చాలా రోజులుగా టిడిపి మీద పదునైనా బాణాలేస్తూనే ఉన్నారు, తనదయిన శైలిలో.

పృథ్వీతో పాటు రాజా రవీంద్ర, దాసరి అరుణ్‌, పాతతరం సినీ హీరో భానుచందర్‌, వర్ధమాన నటులు కృష్ణుడు కూడా పార్టీలో చేరారు.

పేరుమోసిన నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ సైతం విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీకి దిగుతున్నారు.
తనకు సీటు రాకపోయినా జగన్ ను ముఖ్యమంత్రిగా చూడటమే తన లక్ష్యమనిఆయన విజయంకోసం ప్రచారం చేస్తానని సినీనటుడు అలీ ప్రకటించేశాడు.