మహనీయులైతే మాత్రం, రోడ్ల పక్కన విగ్రహాలెందుకు వుండాలి.? చాలాకాలంగా నడుస్తున్న రచ్చ ఇది. మహనీయుల త్యాగాల్ని గుర్తుంచుకోవాల్సిందే.. కానీ, అందుకు రోడ్డు పక్కన విగ్రహాలు పెట్టడం సరైన పద్ధతి కాదు. వాటి మెడలో చెప్పుల దండలు వేసి, వాటిని ధ్వంసం చేసి.. ఇలా ఏ చిన్న ఘటన జరిగినా.. అది కాస్త పెద్ద రాజకీయ దుమారానికి కారణమవుతుంటుంది. రాజకీయ ప్రముఖుల విగ్రహాల విషయంలోనూ ఇంతే. అసలు రోడ్లకు అడ్డంగా విగ్రహాలు ఎందుకు పెట్టాలి.? అన్న ప్రశ్నకు ఏ రాజకీయ పార్టీ దగ్గరా సరైన సమాధానం వుండదు. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో వైఎస్సార్ విగ్రహాల వ్యవహారం పెను రాజకీయ రచ్చకు కారణమైంది.
రోడ్ల వెడల్పు పేరుతో, గ్రామంలోని పలు ఇళ్ళను వైసీపీ సర్కారు ధ్వంసం చేసిందన్నది ఆరోపణ. ఇళ్ళనైతే కూల్చారుగానీ, రోడ్లకు అడ్డంగా వున్న వైఎస్సార్ విగ్రహాలకు మాత్రం కంచెలు ఏర్పాటు చేశారంటూ విపక్షాలు విమర్శించాయి. ఉత్త విమర్శ కాదు, ఆ విగ్రహాలకు నిజంగానే కంచె ఏర్పాటు చేశారు. విపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో, చివరికి ఆయా విగ్రహాలను తొలగించక తప్పలేదు ప్రభుత్వానికి. ఈ పనేదో ముందే చేసి వుంటే.. ఇంత రాజకీయ రచ్చకు ఆస్కారం వుండేది కాదు కదా.! కాస్త ముందు.. కాస్త వెనక.. అంతే తేడా.. అని సరిపెట్టుకోవడానికి వీల్లేదు. జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది రాజకీయంగా వైసీపీకి. విగ్రహం ఏర్పాటు గౌరవం కాకపోవచ్చు.. కానీ, తొలగింపు ముమ్మాటికీ అవమానకరం. రాజశేఖర్ రెడ్డిని మహానుభావుడిగా వైసీపీ భావిస్తుంటే, ఇకపై ఇలాంటి తొలగింపుకి అవకాశమున్న రీతిలో విగ్రహాలు ఏర్పాటు చేయకపోవడమే మంచిది. అదే ఆయనకు ఆ పార్టీ ఇచ్చే గౌరవం అవుతుంది.